Mouse Births Pups: అంతరిక్షం నుంచి తిరిగొచ్చి పిల్లలకు జన్మనిచ్చిన ఎలుక.. చైనా ప్రయోగం సక్సెస్

Chinese Academy of Sciences Space experiment success rat gives birth
షార్ట్స్‌లో చూడండి
చైనా అంతరిక్ష పరిశోధనలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల చైనా స్పేస్ స్టేషన్‌కు వెళ్లివచ్చిన నాలుగు ఎలుకల్లో ఒకటి, భూమి మీదకు తిరిగొచ్చాక ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) శనివారం అధికారికంగా ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే... రెండు మగ, రెండు ఆడ ఎలుకలను అక్టోబర్ 31న షెంజౌ-21 వ్యోమనౌక ద్వారా చైనా స్పేస్ స్టేషన్‌కు పంపారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో వాటిని ఉంచి, నవంబర్ 14న తిరిగి భూమికి తీసుకొచ్చారు. భూమికి చేరిన తర్వాత వాటిలో ఒక ఆడ ఎలుక గర్భం దాల్చి ఈ నెల‌ 10న తొమ్మిది పిల్లలను ప్రసవించింది. వాటిలో ఆరు పిల్లలు ఆరోగ్యంగా జీవించి ఉన్నాయి. తల్లి ఎలుక పిల్లలకు పాలిస్తోందని, అవి చురుకుగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

"స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణం ఎలుకల పునరుత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఈ ప్రయోగం రుజువు చేసింది. అంతరిక్ష వాతావరణం క్షీరదాల ప్రారంభ అభివృద్ధి దశలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ద్వారా అమూల్యమైన నమూనాలు లభించాయి" అని సీఏఎస్‌ పరిశోధకురాలు వాంగ్ హాంగ్‌మీ తెలిపారు.

క్షీరదాలపై చైనా అంతరిక్షంలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి. మనుషులతో జన్యుపరమైన పోలికలు, చిన్న పరిమాణం, వేగవంతమైన పునరుత్పత్తి చక్రం వంటి కారణాల వల్ల ఈ ప్రయోగానికి ఎలుకలను ఎంచుకున్నారు. స్పేస్ స్టేషన్‌లో ఎలుకల కోసం భూమిపై ఉన్నట్లే పగలు, రాత్రి సమయాలను అనుసరించి లైటింగ్ వ్య‌వ‌స్థ‌, ప్రత్యేకమైన ఆహారం, వ్యర్థాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం జీవుల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. గతంలో చైనా జీబ్రా ఫిష్, ఫ్రూట్ ఫ్లైస్ వంటి జీవులపై అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించింది.
Go Back to Shorts
Mouse Births Pups
Chinese Academy of Sciences
China space station
space experiment
rat reproduction
Shenzhou-21 spacecraft
space research
Wang Hongmei
mammal development
zero gravity effects

More Telugu News