Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త ప్రపంచ రికార్డ్.. టీ20 చరిత్రలో అగ్రస్థానం

Harmanpreet Kaur Breaks Record for Most T20 Wins as Captain
  • టీ20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డ్
  • ఆసీస్ దిగ్గజం మెగ్ లానింగ్ రికార్డును అధిగమించిన కౌర్
  • కెప్టెన్‌గా 77వ టీ20 విజయాన్ని నమోదు చేసిన హర్మన్‌ 
  • పురుషులు, మహిళల క్రికెట్‌లో ఇదే అత్యధికం
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో నిన్న‌ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ ఈ అరుదైన ఘనతను అందుకుంది.

కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌కు ఇది 77వ టీ20 విజయం. దీంతో ఆమె ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారిణి మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. పురుషుల, మహిళల క్రికెట్‌లో కలిపి ఏ కెప్టెన్‌కూ ఇన్ని విజయాలు లేకపోవడం విశేషం. పురుషుల టీ20ల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 50 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో రేణుకా ఠాకూర్ 4 వికెట్లు, దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగడంతో శ్రీలంకను భారత్ త‌క్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. అనంతరం ఛేదనలో షఫాలీ వర్మ కేవలం 42 బంతుల్లోనే 79 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో, భారత్ 40 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

హర్మన్‌ప్రీత్ ఇప్పటివరకు 130 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించింది. ఇది కూడా ఒక రికార్డే. అలాగే, మహిళల టీ20 చరిత్రలో అత్యధికంగా 185 మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా కూడా ఆమె నిలిచింది. రెండు నెలల క్రితం భారత్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన హర్మన్‌ప్రీత్, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం.
Harmanpreet Kaur
India women cricket
T20 record
Meg Lanning
Renuka Thakur
Deepti Sharma
Shafali Verma
T20 wins
cricket captain

More Telugu News