Delhi Capitals: కెనడాలో ఢిల్లీ క్యాపిటల్స్ అడుగులు.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అకాడమీ ప్రారంభం!

Delhi Capitals Launches Cricket Academy in Canada
  • మిస్సిసాగాలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ప్రారంభం
  • జనవరిలో ట్రయల్స్ నిర్వహించి క్రీడాకారుల ఎంపిక
  • స్థానిక అంటారియో క్రికెట్ అకాడమీతో కలిసి పని చేయనున్న డీసీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తన కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. తాజాగా ఉత్తర అమెరికా ఖండంలో అడుగుపెట్టింది. కెనడాలోని అంటారియో రాష్ట్రం, మిస్సిసాగాలో తన తొలి క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. లండన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో అంతర్జాతీయ అకాడమీ కావడం విశేషం.

ప్రపంచంలో క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కెనడా ఒకటి. ఈ ప్రాంతంలోని యువ క్రికెటర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నత స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. దీనికోసం అంటారియో క్రికెట్ అకాడమీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 జనవరిలో ట్రయల్స్ నిర్వహించి, ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేసి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ విస్తరణపై ఢిల్లీ క్యాపిటల్స్ సీఈవో సునీల్ గుప్తా మాట్లాడుతూ.. "కెనడాలో అకాడమీని ప్రారంభించడం అనేది ప్రపంచవ్యాప్త అభివృద్ధికి వేసిన ముఖ్యమైన అడుగు. ఇక్కడి క్రీడాకారులకు కూడా భారత్‌లోని ఉన్నత ప్రమాణాలతో కూడిన కోచింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం" అని తెలిపారు. అంటారియో క్రికెట్ అకాడమీ డైరెక్టర్ డెరెక్ పెరీరా మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం కెనడియన్ క్రికెట్ భవిష్యత్తును మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుల ఉమ్మడి యాజమాన్యంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 2008లో 'ఢిల్లీ డేర్‌డెవిల్స్'గా ప్రయాణాన్ని ప్రారంభించి 2019లో కొత్త రూపాన్ని సంతరించుకుంది. అటు ఐపీఎల్, ఇటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ బలమైన పోటీనిస్తోంది. ముఖ్యంగా మహిళల లీగ్‌లో వరుసగా మూడుసార్లు ఫైనల్ చేరి తన సత్తా చాటింది.
Delhi Capitals
IPL
Canada
Cricket Academy
Ontario
Mississauga
Sunil Gupta
Cricket training
GMR
JSW Group

More Telugu News