Raja Singh: మళ్లీ బీజేపీ గూటికి చేరడంపై సంకేతాలు ఇస్తున్న రాజా సింగ్!

Raja Singh Signals Return to BJP After Resignation
  • ఇవాళ కాకపోతే రేపైనా సొంత గూటికి చేరే అవకాశం ఉందన్న ఎమ్మెల్యే రాజాసింగ్ 
  • బీజేపీకి తాను నిజమైన సైనికుడినని వ్యాఖ్య 
  • అసెంబ్లీలో, బయట తమకు స్వేచ్చ కాావాలని కోరతానని వెల్లడి  
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  గోషామహాల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ .. తరచు వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉన్న రాజాసింగ్ తాజాగా మళ్లీ సొంతగూటికి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాకపోతే రేపైనా తాను సొంతింటికి వెళ్లే అవకాశం ఉందంటూ తిరిగి బీజేపీలో చేరే సంకేతాలను రాజాసింగ్ ఇచ్చారు. ఇదే సందర్భంగా పార్టీ పెద్దలపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ఒక కుటుంబంలోని నలుగురు అన్నదమ్ముల్లో గొడవ జరిగి ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందని అలాగే తాను కూడా ఇవాళ కాకపోతే రేపైనా సొంత ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని అన్నారు. 

బీజేపీకి తాను నిజమైన సైనికుడినని చెప్పుకున్న రాజాసింగ్.. ఢిల్లీ లేదా రాష్ట్ర నాయకులు ఆహ్వానించిన రోజున తిరిగి పార్టీలోకి వస్తానని తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా అభ్యర్ధన చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని, అయితే అసెంబ్లీలో, బయట స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు. పార్టీ ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఇస్తేనే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందన్నారు. 

తమకు స్వేచ్ఛ లభించిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో ఎలా రాజకీయ పోరాటం చేస్తామో అందరికీ చూపిస్తామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారని, త్వరలో ఆయన మళ్లీ కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 
Raja Singh
BJP
Telangana politics
Goshmahal constituency
BJP comeback
Raja Singh BJP
Telangana BJP
Raja Singh comments
political news
Indian politics

More Telugu News