JP Nadda: వైద్య రంగంలో 'పీపీపీ' వద్దంటున్న వైసీపీ... మంత్రి సత్యకుమార్ కు కేంద్రమంతి జేపీ నడ్డా కీలక లేఖ

JP Nadda letter urges PPP model in Andhra Pradesh health sector
  • ఏపీలో వైద్య రంగానికి పీపీపీ మోడల్ అవసరం అన్న కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా
  • వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనల నడుమ కీలక పరిణామం
  • పీపీపీ ప్రాజెక్టులకు 80 శాతం వరకు నిధులు ఇస్తామని కేంద్రం హామీ
  • ఆరోగ్య శాఖలో ప్రత్యేక పీపీపీ సెల్ ఏర్పాటు చేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించి, సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ఒక లేఖ రాశారు.

రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వైసీపీ ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం సమర్థిస్తున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగాల్లో పీపీపీ విధానం విజయవంతమైందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి, వారి నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికి ఇది సరైన మార్గమని నడ్డా తన లేఖలో పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణ, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, డయాగ్నస్టిక్, డయాలసిస్ సేవలను విస్తరించడంలో పీపీపీ మోడల్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.

పీపీపీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక సహకారం అందిస్తోందని నడ్డా తెలిపారు. 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)' పథకం కింద ప్రాజెక్ట్ వ్యయంలో 80 శాతం వరకు, తొలి ఐదేళ్ల నిర్వహణ ఖర్చులలో 50 శాతం వరకు నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయని స్పష్టం చేశారు. అలాగే, ప్రాజెక్టుల అధ్యయనానికి 'ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ (IIPDF)' కింద రూ.5 కోట్ల వరకు సాయం అందిస్తామన్నారు.

ఈ పథకాల సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఒక ప్రత్యేక పీపీపీ సెల్‌ను ఏర్పాటు చేయాలని నడ్డా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తే, వైద్య రంగంలో గణనీయమైన మార్పులు వస్తాయని, ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
JP Nadda
Andhra Pradesh
Health sector
PPP model
YCP criticism
Medical colleges
Satyakumar Yadav
Central government
Healthcare infrastructure
Public Private Partnership

More Telugu News