Parakamani case: పరకామణి కేసు... హైకోర్టు కీలక ఆదేశాలు
- నిందితుడు రవికుమార్ ఆస్తులపై మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించిన రవికుమార్
- కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్న కోర్టు
- తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసు మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రవికుమార్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదికను సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను ఏసీబీ డీజీ నేరుగా కోర్టుకు అందజేయడం విశేషం.
ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు, దానిని పూర్తిగా పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంలో మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసుకు సంబంధించిన దర్యాప్తు చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆస్తుల సమీకరణ, అక్రమ లావాదేవీలు, ఇతరుల పాత్రపై లోతైన విచారణ అవసరమని సూచించింది. తదుపరి విచారణను 2026 జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.