Zepto: జెప్టో సేల్స్ డబుల్.. నష్టాలు ట్రిపుల్

Zeptos losses widen 177 pc in FY25 to Rs 3367 crore
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైన జెప్టో అమ్మకాలు
  • అంతకుమించి 177 శాతం పెరిగిన కంపెనీ నష్టాలు
  • రూ. 9,668 కోట్ల అమ్మకాలపై రూ. 3,367 కోట్ల నష్టం
  • మార్కెట్లో తీవ్రమైన పోటీయే నష్టాలకు కారణం
క్విక్ కామర్స్ సంస్థ జెప్టో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించినప్పటికీ, నష్టాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కంపెనీ విడుదల చేసిన ఆర్థిక నివేదికల ప్రకారం.. అమ్మకాలు రెట్టింపు కాగా, నష్టాలు అంతకుమించి పెరిగాయి.

వివరాల్లోకి వెళితే... 2024-25 ఆర్థిక సంవత్సరంలో జెప్టో మొత్తం అమ్మకాలు రూ. 9,668.8 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇవి రూ. 4,223.9 కోట్లుగా ఉండగా, ఏకంగా 129 శాతం వృద్ధి కనిపించింది. అయితే, ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం 177 శాతం పెరిగి రూ. 3,367.3 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 1,214.7 కోట్లు మాత్రమే.

మార్కెట్లో పోటీ తీవ్రతరం కావడంతో కార్యకలాపాల విస్తరణ, కొత్త డార్క్ స్టోర్ల ఏర్పాటు, కస్టమర్లను ఆకర్షించడం కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడమే ఈ నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. టర్నోవర్‌తో పోలిస్తే నష్టాల వాటా ఎఫ్‌వై24లో 29 శాతంగా ఉండగా, ఎఫ్‌వై25 నాటికి అది 35 శాతానికి పెరిగింది.

ఐపీఓకు సిద్ధమవుతూ బోర్డులో కీలక మార్పులు
ఇలాంటి ఆర్థిక ఫలితాల నేపథ్యంలోనే జెప్టో పబ్లిక్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈరోజు ఐపీఓ కోసం రహస్యంగా ముసాయిదా పత్రాలను దాఖలు చేయనుందని స‌మాచారం. దీనికి అనుగుణంగా ఈ నెల‌ 23న జరిగిన వాటాదారుల సమావేశంలో కంపెనీ వ్యవస్థాపకులు ఆదిత్య పాలిచా, కైవల్య వోహ్రా, సీఎఫ్‌ఓ రమేశ్ బఫ్నాలను పూర్తికాల డైరెక్టర్లుగా నియమిస్తూ బోర్డులో కీలక మార్పులు చేశారు.
Zepto
Zepto sales
Zepto losses
Aditya Palicha
Kaivalya Vohra
Ramesh Bafna
Quick commerce
IPO
Financial report
Dark stores

More Telugu News