Chandrababu: ప్రాచీన విజ్ఞానానికి భారత్ పుట్టినిల్లు: సీఎం చంద్రబాబు

Chandrababu Praises Indias Ancient Knowledge in Bharatiya Vigyan Sammelan
  • భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై ప్రశంసల వర్షం
  • ప్రాచీన కాలంలోనే విజ్ఞానంలో భారత్ అగ్రగామి అన్న ముఖ్యమంత్రి
  • యోగా, ఆయుర్వేదం, సున్నాను ప్రపంచానికి అందించింది మనమేనని వెల్లడి
  • ఆర్యభట్ట, కౌటిల్యుడు వంటి మహానుభావులు మనకు స్ఫూర్తిదాయకమ‌న్న చంద్ర‌బాబు
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, దేశ ప్రాచీన వైభవాన్ని, విజ్ఞాన ఘనతను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి ఇది సరైన వేదిక అని ఆయన అన్నారు.

ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా నిలిచిందని చంద్రబాబు గుర్తుచేశారు. "వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మనది. 2900 ఏళ్ల క్రితమే యోగాను అభ్యసించాం. నేడు ప్రధాని మోదీ కృషితో 150 దేశాలు యోగాను పాటిస్తున్నాయి. 2600 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించిన చరిత్ర మనకుంది" అని ఆయన వివరించారు.

పూర్వ కాలంలోనే తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత భారతదేశానిదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి సున్నాను పరిచయం చేసింది, మెదడుకు పదునుపెట్టే చదరంగాన్ని కనిపెట్టింది కూడా భారతీయులేనని ఆయన అన్నారు.

ఖగోళశాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహానుభావులు మనందరికీ స్ఫూర్తి అని చంద్రబాబు పేర్కొన్నారు. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన ఎందరో నిపుణులు మన దేశం సొంతమని ఆయన అన్నారు.
Chandrababu
Bharatiya Vigyan Sammelan
Indian science
Ancient India
RSS Mohan Bhagwat
Harappa civilization
Yoga
Ayurveda
Takshashila University
Nalanda University

More Telugu News