Pragathi: కోట్ల రూపాయల వ్యాపారం ఇది... బలహీనతలకు చోటు ఉండదు: ప్రగతి
- సినిమా కేవలం కళ మాత్రమే కాదన్న ప్రగతి
- కోట్లతో నడిచే భారీ వ్యాపారం అని వ్యాఖ్య
- వ్యక్తిగత ప్రయోజనాల కోసం సినిమాను పణంగా పెట్టే పరిస్థితి ఉండదని వెల్లడి
టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాలతో చర్చనీయాంశమయ్యారు. నటనతో పాటు, క్రీడాకారిణిగా నిజ జీవితంలో వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా కాస్టింగ్ ప్రక్రియ, నిర్మాతల ఆలోచనా విధానం, సినిమా వ్యాపార స్వరూపంపై దృష్టి సారించాయి. “సినిమా అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు... అది కోట్ల రూపాయల పెట్టుబడితో నడిచే భారీ వ్యాపారం” అని ప్రగతి స్పష్టం చేశారు.
ఒక సినిమా కోసం నిర్మాతలు, దర్శకులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని... అలాంటి పరిస్థితుల్లో వారు వ్యక్తిగత అభిరుచులు లేదా భావోద్వేగాలకంటే సినిమా విజయం, లాభాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారని ప్రగతి తెలిపారు. నటీనటుల ఎంపికలో కూడా అదే విధానం ఉంటుందని చెప్పారు.
“ఆ పాత్రకు ఎవరు సరిపోతారు? ఎవరి వల్ల సినిమాకు మార్కెట్ వస్తుంది? ఎవరి నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది?” అనే అంశాలనే నిర్మాతలు, దర్శకులు చూస్తారని ఆమె వివరించారు. కేవలం వ్యక్తిగత కారణాల కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం సినిమాను పణంగా పెట్టే పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు.
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం ఒక్కటే సరిపోదని, దానికి తోడు నటన, క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం చాలా అవసరమని ప్రగతి అన్నారు. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఒక నటిని ఎంపిక చేసేటప్పుడు ఆమె సినిమాకు తీసుకువచ్చే విలువనే ముఖ్యంగా చూస్తారని చెప్పారు. మిగిలిన విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని అన్నారు.
కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై తరచూ వినిపించే విమర్శల గురించి కూడా ప్రగతి మాట్లాడారు. కొందరు సినిమా అవకాశాల కోసం తప్పుడు మార్గాలు ఉంటాయని భావిస్తారని, కానీ ఒక స్థాయికి చేరుకున్న దర్శకులు, నిర్మాతలు మాత్రం సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరని అన్నారు.
“ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల కోట్ల పెట్టుబడి నష్టపోవచ్చు. అందుకే వారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు” అని ప్రగతి వ్యాఖ్యానించారు. పెద్ద హీరోలు, పేరున్న దర్శకులతో చేసే సినిమాల్లో ప్రతి నిమిషం చాలా కీలకమని, అటువంటి ప్రాజెక్టుల్లో వ్యక్తిగత కారణాల కోసం షూటింగ్ లేదా నాణ్యతను పక్కన పెట్టే అవకాశం లేదని ప్రగతి స్పష్టం చేశారు. సినిమా విజయమే అందరి లక్ష్యమని ఆమె అన్నారు.