Juyel Sheikh: బంగ్లాదేశీయుడిగా భావించి ఒడిశాలో బెంగాల్ వ్యక్తిపై మూకదాడి.. హత్య

Juyel Sheikh Murdered in Odisha Mob Attack Mistaken as Bangladeshi
  • బీడీ ఇవ్వలేదన్న కారణంతో మొదలైన గొడవ
  • నిందితులను బంగ్లాదేశీయులుగా అనుమానించి దారుణం?
  • అలాంటిదేమీ లేదన్న పోలీసులు
  • నిందితులతో వీరికి ముందే పరిచయం ఉందని స్పష్టీకరణ 
  • రాజకీయ రంగు పులుముకున్న ఘటన
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలపై ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో జుయెల్ షేక్ అనే కార్మికుడు మరణించినట్లు పోలీసులు గురువారం ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. సంబల్‌పూర్‌లోని తమ నివాసంలో జుయెల్ షేక్ మరికొందరు వలస కూలీలతో కలిసి భోజనం సిద్ధం చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. మొదట వారు కూలీలను బీడీలు అడిగారు. ఇచ్చేందుకు కూలీలు నిరాకరించడంతో, వారంతా తమ ఆధార్ కార్డులు చూపించాలని నిందితులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఇది మరింత ముదరడంతో దుండగులు జుయెల్ షేక్‌పై దాడిచేసి గట్టి వస్తువుతో తలపై బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జుయెల్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

బంగ్లాదేశీయులనే నెపంతో దాడి? 
ఈ దాడిలో గాయపడిన మరో కార్మికుడు మజహర్ ఖాన్ మాట్లాడుతూ.. "వారు మొదట మా ఆధార్ కార్డులు చూపించాలని అడిగారు, ఆ తర్వాత జుయెల్ తలను గోడకేసి కొట్టారు" అని తెలిపాడు. నిందితులు తమను బంగ్లాదేశీయులని ముద్ర వేసి దాడికి తెగబడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, ఐజీ హిమాన్షు కుమార్ లాల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. మృతుడు బెంగాలీనా? లేక బంగ్లాదేశీయుడా అన్న కోణంతో ఈ హత్యకు సంబంధం లేదని, వీరంతా గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారని, నిందితులతో వీరికి పరిచయం ఉందని తెలిపారు.

రాజకీయ రంగు పులుముకున్న ఘటన
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా స్పందించింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో బెంగాలీ వ్యతిరేక ప్రచారం వల్లే ఈ దాడి జరిగిందని ఆరోపించింది. బెంగాలీ మాట్లాడే భారతీయులను చొరబాటుదారులుగా చిత్రించడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, ఒక పౌరుడి హక్కులను నిరూపించుకోమనే అధికారం సామాన్యులకు ఎవరు ఇచ్చారని టీఎంసీ ప్రశ్నించింది.
Juyel Sheikh
Odisha
Sambalpur
West Bengal
Migrant worker
Mob attack
Murder
TMC
Bengali
Crime

More Telugu News