Shivanvk Awasthi: కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత.. టొరంటో యూనివర్సిటీ సమీపంలో ఘోరం

Indian Student Shivank Awasthi Shot Dead Near Toronto University
  • యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో పట్టపగలే హత్య
  • క్యాంపస్‌లో సరైన భద్రత లేదంటున్న విద్యార్థులు
  • ఇదే నగరంలో భారత సంతతి మహిళ హిమాన్షీ ఖురానా హత్య
కెనడాలోని టొరంటోలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి శివాంక్ అవస్థిని దుండగులు కాల్చి చంపారు. టొరంటో స్కార్‌బరో యూనివర్సిటీ (UTSC) సమీపంలో మంగళవారం పట్టపగలే ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై టొరంటో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం, డిసెంబర్ 23, మధ్యాహ్నం సుమారు 3:34 గంటలకు ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్, హైలాండ్ క్రీక్ ట్రయల్ ప్రాంతంలో గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు, తుపాకీ గాయాలతో పడి ఉన్న శివాంక్‌ను గుర్తించారు. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. పోలీసులు వచ్చేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాటసారి శివాంక్ మృతదేహాన్ని చూసి 911కు కాల్ చేసినట్లు తెలిసింది.

ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యువ భారతీయ డాక్టోరల్ విద్యార్థి శివాంక్ అవస్థి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబంతో టచ్‌లో ఉన్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందిస్తామని" కాన్సులేట్ వివరించింది. భారత కాన్సులేట్ శివాంక్‌ను 'డాక్టోరల్ విద్యార్థి'గా పేర్కొనగా, కొన్ని మీడియా కథనాలు, తోటి విద్యార్థులు అతను 'థర్డ్-ఇయర్ లైఫ్ సైన్సెస్ విద్యార్థి' అని చెబుతున్నారు.

శివాంక్ మృతికి యూనివర్సిటీ చీర్ లీడింగ్ టీమ్ నివాళులర్పించింది. శివాంక్ తమ కుటుంబంలో ఒక సభ్యుడని, ఎప్పుడూ అందరినీ ఉత్సాహపరిచే వ్యక్తిని కోల్పోవడం షాక్‌కు గురిచేసిందని వారు పేర్కొన్నారు.  టొరంటోలో ఈ నెలలో భారతీయ పౌరుడు హత్యకు గురికావడం ఇది రెండోసారి కావడంతో స్థానిక భారతీయ సమాజంలో, ముఖ్యంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే, డిసెంబర్ 20న, హిమాన్షి ఖురానా (30) అనే మరో భారతీయ మహిళ మృతదేహం లభించింది. అయితే, ఈ రెండు కేసులకు ఎలాంటి సంబంధం లేదని, నిందితులు వేర్వేరు వ్యక్తులని పోలీసులు స్పష్టం చేశారు.

శివాంక్ హత్య ఘటన తర్వాత UTSC క్యాంపస్‌లో కొంతసేపు షెల్టర్-ఇన్-ప్లేస్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తర్వాత వాటిని ఎత్తివేశారు. ఇది ఒక 'isolated incident' (ఒంటరి సంఘటన) అని, క్యాంపస్‌కు ఎలాంటి ప్రమాదం లేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. టొరంటో పోలీసులు ఈ కేసును 2025లో నగరంలో 41వ హత్యగా నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసిన హోమిసైడ్ డిటెక్టివ్‌లు, సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రయాణించిన వారి డాష్‌క్యామ్ ఫుటేజ్ లేదా నివాస ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి నిందితుల గురించి కానీ, హత్యకు గల కారణాల గురించి కానీ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
 https://www.cbc.ca/lite/story/9.7027786
Shivanvk Awasthi
Toronto University
Indian student shot dead
Canada shooting
Homicide
Toronto crime
Indian consulate
Himanshi Khurana murder
Abdul Gafoori
University of Toronto Scarborough

More Telugu News