Bhavya Sri: ఆలయంలో ప్రదర్శనకు వచ్చి.. మెట్లపై జారిపడి యువ కళాకారిణి మృతి

Bhavya Sri Young Dancer Dies After Fall at Temple Festival
  • కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో ఘటన
  • కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన బృందం
  • మెట్లు దిగుతుండగా కాలుజారి కిందపడిన 17 ఏళ్ల భవ్యశ్రీ
  • తలకు తీవ్ర గాయం కావడంతో మృతి
పండుగ ఉత్సవాలలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన ఒక యువ కళాకారిణి మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది.  కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో జరిగిందీ ఘటన. స్థానిక కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల ప్రారంభానికి వచ్చిన నాట్య బృందంలోని 17 ఏళ్ల బాలిక పాలపర్తి భవ్యశ్రీ ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. రాజమహేంద్రవరం నుంచి 12 మంది కళాకారులతో కూడిన బృందం నిన్న తెల్లవారుజామున శివకోటి చేరుకుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో వారికి వసతి ఏర్పాటు చేశారు. ప్రదర్శనకు సిద్ధమైన భవ్యశ్రీ, పై అంతస్తులోని గది నుంచి మెట్లు దిగుతూ వస్తుండగా కాలు జారి కిందపడింది. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

భవ్యశ్రీ వేసుకున్న ఎత్తైన పాదరక్షల కారణంగానే ఆమె పట్టు కోల్పోయినట్టు తోటి కళాకారులు చెబుతున్నారు.  అయితే,  ఆ మెట్లకు కనీస రక్షణ గోడ కూడా లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె సోదరి పాలపర్తి మధు ఆరోపించారు. ఈ బృందంలో మృతురాలితోపాటు దాదాపు అందరూ మైనర్లే కావడం గమనార్హం. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
Bhavya Sri
Konaseema district
Sivakoti
Rajolu mandal
Kuntaleswari temple
Dance performance accident
Andhra Pradesh news
Rajahmundry
Youth artist death
Temple festival accident

More Telugu News