Gmail: త్వరలో జీ-మెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే సరికొత్త ఆప్షన్!

Gmail Users to Get New Option to Change User ID Soon
  • పాత యూజర్ ఐడీని మార్చుకోవాలనుకునే వారికి శుభవార్త
  • ప్రస్తుతం కొందరికి ఆప్షన్ రోలవుట్ చేసినట్లు సమాచారం
  • అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం
జీ-మెయిల్ వినియోగదారులకు ఇది శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై జీ-మెయిల్ ఐడీని మార్చుకునే అవకాశం కలగనుంది. పాత యూజర్ ఐడీతో సంతృప్తి చెందని వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే, ఈ ఆప్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కొందరికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

మెయిల్ క్రియేట్ చేసే సమయంలో సరైన ఆలోచన లేకనో, నచ్చిన పేర్లు అందుబాటులో లేకనో చాలామంది ఏదో ఒక యూజర్ ఐడీతో మెయిల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఐడీ మార్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో చాలా సందర్భాలలో అదే ఈ-మెయిల్ ఐడీని కొనసాగించాల్సి వస్తుంది. పాత డేటాను కోల్పోవడం ఇష్టం లేనివారు కూడా అదే మెయిల్‌ను ఉపయోగిస్తుంటారు.

ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, ఈ-మెయిల్ ఐడీని మార్చుకునే సౌలభ్యాన్ని గూగుల్ తీసుకువచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ కనిపించింది. ఐడీ చివరలో జీమెయిల్.కామ్‌ను అలాగే కొనసాగిస్తూ యూజర్ నేమ్‌ను మార్చుకోవచ్చు. ఐడీ మార్చుకున్నప్పటికీ అది పాత ఖాతాగానే పరిగణించబడుతుంది.

అయితే, ఒకసారి ఐడీ మార్చుకున్న తర్వాత ఏడాది వరకు మళ్లీ మార్చుకునే అవకాశం ఉండదు. అలాగే, ఒక ఐడీని గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.
Gmail
Gmail User ID
Google
Email ID Change
Gmail Update
Google Support
Email Account

More Telugu News