Tarique Rahman: బంగ్లాదేశ్‌లో తారిఖ్ రెహమాన్ తొలి ప్రసంగం.. ఉస్మాన్ హాదీ మృతి ప్రస్తావన

Tarique Rahman First Speech in Bangladesh Mentions Usman Hadi Death
  • హాదీ ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కోసం కలలు కన్నాడన్న తారిఖ్ రెహమాన్
  • అతడి కల కోసం తమ పార్టీ పని చేస్తుందన్న తారిఖ్
  • మెరుగైన బంగ్లాదేశ్ నిర్మాణానికి తన వద్ద ప్రణాళిక ఉందని వెల్లడి
  • షేక్ హసీనా పాలనపై విమర్శలు
ఇటీవల హత్యకు గురైన విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కోసం కలలు కన్నాడని, అతడి కల కోసం తమ పార్టీ కృషి చేస్తుందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ పేర్కొన్నారు. హాదీ ఇటీవల సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి విదితమే. ఆ తరువాత బంగ్లాదేశ్‌లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హింస, నిరసనలతో అస్థిరంగా ఉన్న బంగ్లాదేశ్‌కు తారిఖ్ 17 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు.

బంగ్లాదేశ్‌కు చేరుకున్న అనంతరం పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మెరుగైన బంగ్లాదేశ్‌ను నిర్మించేందుకు తన వద్ద ఒక ప్రణాళిక ఉందని తెలిపారు. ఆ ప్రణాళికను అందరూ కలిసికట్టుగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

1971లో ఒకసారి, 2024లో మరోసారి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని ఆయన అన్నారు. మెరుగైన బంగ్లాదేశ్ నిర్మాణం కోసం, శాంతి కోసం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అవిశ్రాంతంగా పని చేస్తుందని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ అభివృద్ధి ప్రయాణంలో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తారిఖ్ పేర్కొన్నారు.

మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆమె పాలనలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారని ఆరోపించారు. తన తల్లి ఖలీదా జియా అనారోగ్యం గురించి ప్రస్తావిస్తూ, తన మనసంతా ఆమె వద్దనే ఉందని అన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన తల్లిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు.
Tarique Rahman
Bangladesh
Usman Hadi
Bangladesh Nationalist Party
BNP
Sheikh Hasina
Khaleda Zia

More Telugu News