Chinmayi Sripada: క్షమాపణ చెప్పినా శివాజీని వదలని సింగర్ చిన్మయి
- హీరోయిన్ల దుస్తులపై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు
- శివాజీపై ఇప్పటికే విమర్శలు గుప్పించిన చిన్మయి, అనసూయ తదితరులు
- శివాజీ వివరణతో సమస్య పరిష్కారం కాదని చిన్మయి వ్యాఖ్య
‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మహిళా కమిషన్ దాకా వెళ్లగా, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినా వివాదం మాత్రం చల్లారడం లేదు.
ఇప్పుడు ఈ అంశంపై సింగర్, సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి మరోసారి ఘాటుగా స్పందించారు. శివాజీ వివరణలతో అసలు సమస్య పరిష్కారం కావడం లేదని... శివాజీ వివరణ ఇస్తున్న కొద్దీ, మహిళలకు ఇండస్ట్రీలో రక్షణ లేదనే విషయం మరింత స్పష్టమవుతోందని చెప్పారు.
వేధింపులకు అసలు కారణం పురుషుల ప్రవర్తనే అని అంగీకరించడానికి చాలామంది సిద్ధంగా లేరని చిన్మయి తెలిపారు. మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను పరోక్షంగా ప్రోత్సహించినట్టేనని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పడానికి భయపడుతున్నారని అన్నారు. ఇది ఒక మహిళ సమస్య మాత్రమే కాదని... మొత్తం మహిళా సమాజానికి సంబంధించిన అంశమని చెప్పారు.