Ram Gopal Varma: టాలీవుడ్, బాలీవుడ్ టాప్ డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
- 'ధురంధర్' సినిమాను ఆకాశానికెత్తేసిన వర్మ
- ఈ సినిమా గురించి మాట్లాడటానికి కూడా పెద్ద డైరెక్టర్లు భయపడుతున్నారని విమర్శ
- పెద్ద సినిమాల డైరెక్టర్లను కుక్కలా భయపెడుతోందని వ్యాఖ్య
వివాదాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే టాలీవుడ్, బాలీవుడ్ టాప్ డైరెక్టర్లను టార్గెట్ చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ధురంధర్’ సినిమాను ఆకాశానికెత్తేస్తూనే, స్టార్ దర్శకుల సినిమాలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్ద దర్శకులు ‘ధురంధర్’ సినిమా గురించి మాట్లాడటానికి కూడా వెనుకాడుతున్నారని వర్మ అభిప్రాయపడ్డారు. అది అహంకారమో, నిర్లక్ష్యమో కాదని... ఆ సినిమా స్థాయిని తాము ఎప్పటికీ అందుకోలేమనే భయమే కారణం అని ఆయన అన్నారు. ఒక గొప్ప సినిమా వచ్చినప్పుడు, దానిని మెచ్చుకోవాల్సింది పోయి, మౌనంగా ఉండటం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా మారిందని వర్మ ఎద్దేవా చేశారు.
తన స్టైల్‌కు తగ్గట్టుగా వర్మ ఈ పరిస్థితిని ఒక ఆసక్తికరమైన ఉదాహరణతో వివరించారు. ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు అక్కడ పెద్దగా ఉన్న, భయంకరంగా కనిపించే కుక్క ఉంటే... 'అది ఏమీ చేయదు' అని యజమాని చెప్పినా మన దృష్టి మాత్రం ఆ కుక్కపైనే ఉంటుందని అన్నారు. అదే తరహాలో, ప్రస్తుతం ప్రతి పెద్ద సినిమా ఆఫీసులో ‘ధురంధర్’ అనే పేరు ఒక భయపెట్టే కుక్కలా తిరుగుతోందని... ఆ సినిమా పేరు ఎత్తడానికి కూడా దర్శకులు భయపడుతున్నారని... కానీ వారి ఆలోచనల్లో మాత్రం ‘ధురంధర్’నే మొదట మెదులుతోందని వర్మ వ్యాఖ్యానించారు.
కేవలం భారీ సెట్లు, ఖరీదైన వీఎఫ్ఎక్స్, ఐటమ్ సాంగ్స్, హీరో ఎలివేషన్ సీన్లనే నమ్ముకుని సినిమాలు చేసే దర్శకులకు ‘ధురంధర్’ ఒక హారర్ ఫిల్మ్‌లా మారిందని వర్మ చురకలు అంటించారు. హీరోలను దేవుళ్లలా చూపించడం కాదు, సినిమానే హీరో కావాలన్న భావనను ఈ చిత్రం బలంగా చాటిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్’ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదని, గత 50 ఏళ్లలో ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధికంగా చర్చకు వచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని వర్మ కొనియాడారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది వర్మ మాటలకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు మాత్రం మరోసారి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.