VC Sajjanar: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే.. వాహనం సీజ్, రూ. 10 వేల ఫైన్, జైలు శిక్ష.. సజ్జనార్ హెచ్చరిక

Drunk Driving to face Vehicle Seizure Fine and Jail warns Sajjanar
  • న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక
  • పార్టీలకు వెళ్లే వాళ్లు డ్రెవర్లను వెంట తీసుకురావాలని సూచన
  • సామాన్యులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని వార్నింగ్

హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ శాఖ... డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు.


నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ పరిసరాల్లో నిర్వహించిన తనిఖీల్లో సీపీ పాల్గొని, పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు. తనిఖీల విధానంపై సూచనలు ఇవ్వడమే కాకుండా, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు.


డ్రంకెన్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలపై సీపీ సజ్జనార్ వాహనదారులకు స్పష్టంగా వివరించారు. “ప్రతిరోజూ మీడియాలో చెబుతున్నాం. అయినా చదువుకున్న వారు కూడా ఇలా మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఎలా?” అని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని అన్నారు.


పబ్‌లు, పార్టీలకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్లను వెంట తీసుకురావాలని లేదా క్యాబ్‌లు బుక్ చేసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబరు 31 రాత్రి వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సీపీ స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా సుమారు 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.


డ్రంకెన్ డ్రైవ్‌పై ఎలాంటి ఉపేక్ష ఉండదని సజ్జనార్ తేల్చిచెప్పారు. అలా పట్టుబడిన వారి వాహనాన్ని సీజీ చేస్తామని, రూ. 10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 6 నెలల జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు. సేవించిన మద్యం మోతాదును బట్టి శాశ్వతంగా లైసెన్స్ రద్దుకు రవాణా శాఖకు సిఫారసు చేస్తామని తెలిపారు.

VC Sajjanar
Hyderabad police
Drunk and drive
Road safety
Traffic rules
Banjara Hills
Drink driving
New Year celebrations
Telangana police
Traffic violations

More Telugu News