Kesineni Chinni: సీఎం చంద్రబాబుతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భేటీ .. ఆ కీలక అంశంపై వినతి

Kesineni Chinni Meets CM Chandrababu on Vijayawada Municipal Corporation
  • గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుపై సీఎంకు ఎంపీ కేశినేని వినతి 
  • సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు
  • త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఎంపీ
గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కోరారు. ఈ మేరకు ఆయన, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సుస్థిర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని కోరుతూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా అందజేశారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర పరిసరాల్లోని 74 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటైతే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులకు ఒక పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాము చేసిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని పేర్కొన్నారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేశినేని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Kesineni Chinni
Vijayawada
Greater Vijayawada Municipal Corporation
Chandrababu Naidu
Andhra Pradesh
Gadde Rammohan
Municipal Corporation Expansion
NTR District
Krishna District
Urban Development

More Telugu News