Vihar: పెన్సిలే ఆ పసివాడికి మృత్యుపాశం.. కింద పడటంతో గొంతులోకి దిగబడి ఆరేళ్ల బాలుడి మృతి!

Vihar 6 year old dies after pencil pierces throat in school
  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘటన
  • టాయిలెట్‌కు వెళ్లి వస్తుండగా కాలుజారి కిందడిన బాలుడు
  • ఆ సమయంలో చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి దూసుకెళ్లిన వైనం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత
అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న ఆ చిన్నారిని మృత్యువు పెన్సిల్ రూపంలో కబళించింది. మూత్రశాలకు వెళ్లి తిరిగి తరగతి గదికి వస్తున్న క్రమంలో అదుపుతప్పి పడిపోవడంతో చేతిలోని పెన్సిల్ కాస్తా గొంతులోకి దూసుకుపోయి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

గ్రామానికి చెందిన మేడారపు ఉపేంద్రాచారి, మౌనిక దంపతుల చిన్న కుమారుడు విహార్ (6) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం విరామ సమయంలో విహార్ మూత్రశాలకు వెళ్లాడు. తిరిగి క్లాస్‌రూమ్‌కు పరుగెత్తుకుంటూ వస్తుండగా మైదానంలో అకస్మాత్తుగా కాలు జారి బోర్లా పడిపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో బాలుడి చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి బలంగా దిగబడటంతో తీవ్ర రక్తస్రావమైంది.

బాలుడి పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్గమధ్యంలోనే విహార్ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తమ కుమారుడి నిర్జీవ దేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Vihar
Vihar death
pencil death
school accident
Khammam district
Kusumanchi mandal
Nayakangudem
school tragedy
child death
Andhra Pradesh news

More Telugu News