Temba Bavuma: ఆ మాటలు నన్ను బాధించాయి.. కానీ ఆ ఇద్ద‌రు భార‌త స్టార్లు నాకు సారీ చెప్పారు: బవుమా

Temba Bavuma Reveals Apology from Bumrah Pant After Remarks
  • నా ఎత్తుపై బుమ్రా, పంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న బవుమా
  • ఆ తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు క్షమాపణ చెప్పారని వెల్లడి
  • తమ కోచ్ 'గ్రోవెల్' అనే పదం వాడటం సరికాదన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ 
  • మైదానంలో జరిగినవి అక్కడే వదిలేస్తానని, వాటిని ప్రేరణగా తీసుకుంటానని స్పష్టీక‌ర‌ణ‌
భారత పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పద సంఘటనలపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించాడు. తన ఎత్తును ఉద్దేశించి భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాత ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వచ్చి తనకు క్షమాపణ చెప్పారని ఆయన వెల్లడించాడు. ఇటీవల ముగిసిన పర్యటనపై 'ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో'కు రాసిన ఒక వ్యాసంలో బవుమా ఈ విషయాలను పంచుకున్నాడు.

"కోల్‌కతా టెస్టు సందర్భంగా నా గురించి వారి భాషలో వాళ్లు ఏదో అన్నారు. ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్లయిన రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వచ్చి క్షమాపణ చెప్పారు. వారు సారీ చెప్పే సమయానికి అసలు విషయం ఏంటో నాకు తెలియదు. మీడియా మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నాను. మైదానంలో జరిగినవి అక్కడే ఉండిపోతాయి. కానీ అన్న మాటలు మరచిపోలేం. వాటిని కక్షగా కాకుండా ప్రేరణగా, ఇంధనంగా వాడుకుంటాం" అని బవుమా తెలిపాడు.

అదే సమయంలో తమ జట్టు కోచ్ షుక్రి కాన్రాడ్ చేసిన 'గ్రోవెల్' (మోకరిల్లేలా చేయడం) వ్యాఖ్యలపైనా బవుమా స్పందించాడు. "మా కోచ్ ఆ పదం వాడటంపై కూడా విమర్శలు వచ్చాయి. ఆ మాట విన్నప్పుడు నాక్కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. బహుశా ఆయన అంతకంటే మంచి పదం ఎంచుకుని ఉండాల్సింది. ఆ తర్వాత ఆయనే స్వయంగా క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం ముగిసింది" అని బవుమా స్పష్టం చేశాడు.

భారత పర్యటన ఎప్పుడూ కఠినంగానే ఉంటుందని ముందే ఊహించామని, తాము అనుకున్నట్లే గట్టి పోటీ ఎదురైందని బవుమా అన్నాడు. ఇటీవల ముగిసిన పర్యటనలో భారత్‌లో 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా, వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే.
Temba Bavuma
Jasprit Bumrah
Rishabh Pant
South Africa cricket
India cricket
Cricket controversy
Shukri Conrad
India vs South Africa
Cricket tour

More Telugu News