Harish Rao: కారు గుర్తు లేని సర్పంచ్ ఎన్నికల్లోనే 4 వేల స్థానాల్లో గెలిచాం: హరీశ్ రావు

Harish Rao Says BRS Won 4000 Sarpanch Seats Without Party Symbol
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే రేవంత్ రెడ్డికి వణుకు అన్న హరీశ్ రావు
  • పంచాయతీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి ప్రచారం చేశారన్న హరీశ్ రావు
  • 90 శాతం వరకు గెలవాల్సిన అధికార పార్టీ 64 శాతమే గెలిచిందన్న మాజీ మంత్రి
గుర్తు లేని సర్పంచ్ ఎన్నికల్లోనే 4 వేలకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కడతారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తారనే భయం కాంగ్రెస్ పార్టీని పట్టుకుందని అన్నారు. ఎన్నికలు పెట్టాలంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజగజ వణుకుతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు.

నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు రేవంత్ రెడ్డి ఎన్నికలంటేనే గజగజ వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం లేదని అన్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయరని, కానీ ఓడిపోతామనే భయంతో ఆయన ఊరూరా తిరిగాడని పేర్కొన్నారు.

సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90 శాతం, వీలైతే 100 శాతం విజయాలు వస్తాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 శాతం ఫలితాలే వచ్చాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 6 వేలకు పైగా సర్పంచ్‌‍లు గెలిస్తే, బీఆర్ఎస్ 4 వేలకు పైగా గెలిచిందని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో జిల్లా పరిషత్‌లు, 90 శాతం వరకు సర్పంచ్‌లు మనమే గెలిచామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందనే రేవంత్ రెడ్డి నిద్రలో కూడా అదే పార్టీని కలవరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా, కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి ఎప్పుడూ మాట్లాడలేదని వెల్లడించారు.
Harish Rao
BRS party
Revanth Reddy
Telangana elections
Sarpanch elections
MPTC elections

More Telugu News