Priyanka Gandhi: ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎంపీ.. స్పందించిన బీజేపీ

Priyanka Gandhi PM Candidate Congress MP Proposes BJP Responds
  • కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గందరగోళంలో ఉంటుందన్న బీజేపీ అధికార ప్రతినిధి
  • ఐఎన్ఎస్ అంటే 'ఐ నీడ్ కన్ఫ్యూజన్' అంటే బాగుంటుందని వ్యాఖ్య
  • రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలలో కాంగ్రెస్ గ్రూపులు ఉన్నాయన్న పూనవాలా
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలనే చర్చపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గందరగోళంలో ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా విమర్శించారు. ఐఎన్ఎస్ అంటే సాధారణంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కానీ ఈ పేరు కంటే 'ఐ నీడ్ కన్ఫ్యూజన్' అనే పేరు ఆ పార్టీకి బాగా సరిపోతుందని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ముఠా రాజకీయాలు కనిపిస్తున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా షెహజాద్ పూనవాలా పలు అంశాలను ఉదహరించారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సఖు, కర్ణాటకలో డీ.కే. శివకుమార్, సిద్ధరామయ్య ఇలా నేతల మధ్య గ్రూపులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ కాంగ్రెస్, ప్రియాంక కాంగ్రెస్ వర్గాలుగా చీలిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రకటనలు రాహుల్ గాంధీపై విశ్వాసం లేనట్లుగా స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

కొన్నిసార్లు శశిథరూర్, రాహుల్ గాంధీ ప్రకటనలతో విభేదిస్తారని, ఇమ్రాన్ మసూద్ ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిగా ప్రతిపాదిస్తారని, ఆ తర్వాత వివరణ ఇస్తుంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడిన మహమ్మద్ మోక్విమ్ కూడా రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశ్నించారని గుర్తు చేశారు. ప్రియాంక గాంధీకి పార్టీలో మరింత కీలక పాత్ర ఇవ్వాలని ఆయన సూచించారని గుర్తు చేశారు.

ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి కావాలనే వ్యాఖ్యలకు రాబర్ట్ వాద్రా కూడా మద్దతు పలికారని, ఇది కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సంక్షోభాన్ని వెల్లడిస్తోందని పూనవాలా అన్నారు. రాహుల్ గాంధీ సామర్థ్యంపై రాబర్ట్ వాద్రాకు నమ్మకం లేనట్లుగా ఉందని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రజల్లోనే కాదు, సొంత పార్టీలో కూడా నమ్మకం లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అని ఆయన విమర్శించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ కూడా ఈ అంశంపై స్పందించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మధ్య విభేదాలు ఉన్నట్లే, కాంగ్రెస్‌లో రాహుల్, ప్రియాంక మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. ప్రధానమంత్రి కావాలనే కలలు కనే హక్కు అందరికీ ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీలో ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ప్రధాని కావాలని కలలు కనే హక్కు రాబర్ట్ వాద్రాకు ఉందని, కానీ రాబోయే 50 ఏళ్లు బీజేపీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ఎంపిక చేయాలని ఆ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాబర్ట్ వాద్రా కూడా స్పందించారు. ప్రియాంక ప్రధాని కావాలని చాలాచోట్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రియాంక దృష్టి ప్రజా సమస్యలపైనే ఉందని ఆయన అన్నారు.
Priyanka Gandhi
Congress
BJP
Rahul Gandhi
Robert Vadra
Imran Masood
Prime Minister Candidate

More Telugu News