Muhammad Yunus: ముహమ్మద్ యూనస్ ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ విడిచి పారిపోవాల్సి వస్తుంది: హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరిక
- హాదీ హత్యతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
- హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వం ఉందన్న హాదీ సోదరుడు
- హాదీని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తతతో నిండిపోయాయి. హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది. ఇటీవల జరిగిన యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య దేశవ్యాప్తంగా హింసకు దారితీసింది. తాజాగా హాదీ సోదరుడు ఒమర్ సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో తాత్కాలిక ప్రభుత్వం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
‘‘మీరు హాదీని చంపారు. ఈ ఘటనను వాడుకుని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయాలని చూస్తున్నారు. హాదీని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోండి. హాదీ హత్య విషయంలో న్యాయం జరగకుంటే, తాత్కాలికక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ కూడా ఒక రోజు బంగ్లాదేశ్‌ను విడిచి పారిపోవాల్సి వస్తుంది’’ అని ఆయన హెచ్చరించారు.
హాదీ గతేడాది విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమం షేక్ హసీనా ప్రభుత్వాన్ని దేశం వీడే స్థితికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో, హాదీ హత్య ఘటన బంగ్లాలో ఉత్కంఠకర రాజకీయ పరిణామాలను సృష్టించింది.
ఇక, మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. దీని వలన వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయంపై అమెరికా చట్ట సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ప్రజలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నించాలి’’ అని వారు సూచించారు. అవామీ లీగ్‌పై విధించిన నిషేధాన్ని పునఃసమీక్షించాలని కోరారు.