H-1B Visa: హెచ్-1బీ వీసాల లాటరీ విధానానికి స్వస్తి.. భారత యువతకు సవాల్‌

H1B Visa Lottery System to End Under Donald Trump Plan
  • అధిక వేతనం, నైపుణ్యాలకే వీసాల్లో ప్రాధాన్యం అంటున్న ట్రంప్ స‌ర్కార్‌
  • 2026 ఫిబ్రవరి 27 నుంచి కొత్త నిబంధనల అమలు
  • భారత యువ ప్రొఫెషనల్స్‌కు కఠిన నిబంధ‌న‌లు
అమెరికాలో హెచ్-1బీ వర్క్ వీసా విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అమలులో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, నైపుణ్యం, అధిక వేతనాల ఆధారంగా వీసాలు కేటాయించే ‘వెయిటెడ్ సెలక్షన్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ రిజిస్ట్రేషన్ సీజన్ నుంచే ఈ మార్పులు వర్తిస్తాయి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం ప్రతి ఏడాది సుమారు 85 వేల హెచ్-1బీ వీసాల కేటాయింపుపై ఈ విధానం ప్రభావం చూపనుంది. తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకొచ్చేందుకు కొందరు యజమానులు లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేశారని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ ఆరోపించారు. అందుకే అధిక నైపుణ్యం, ఎక్కువ జీతాలు పొందే ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం భారతీయులపై భారీ ప్రభావం చూపనుంది. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్న వారిలో భారతీయ టెక్ నిపుణులు, వైద్యులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కెరీర్ ఆరంభ దశలో ఉన్న యువ భారతీయులకు ఈ కొత్త వేతన ప్రమాణాలు అడ్డంకిగా మారనున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై ఏడాదికి అదనంగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రకటన చేసింది. మరోవైపు ధనవంతుల కోసం 10 లక్షల డాలర్ల ‘గోల్డ్ కార్డ్’ వీసాను కూడా ప్రవేశపెట్టింది.

అమెరికా కంపెనీలు ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి హెచ్-1బీ వీసాలు కీలకమని సమర్థిస్తుంటే, విమర్శకులు మాత్రం ఇవి ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలకే ఎక్కువగా వెళ్తున్నాయని వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ కొత్త విధానం అమెరికా ఉద్యోగ విపణిపైతో పాటు వేలాది భారతీయుల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపనుంది.
H-1B Visa
Donald Trump
USCIS
United States
Indian IT Professionals
Work Visa
Immigration
Wage Standards
Gold Card Visa
Foreign Workers

More Telugu News