Mallojula Venugopal: రాజకీయ పార్టీ పెట్టే దిశగా మాజీ మావోలు.. సంకేతాలు ఇచ్చిన మల్లోజుల వేణుగోపాల్

New Political Party Possible Led by Former Maoist Mallojula Venugopal
  • ఇప్పటి వరకు లొంగిపోయిన 600కు పైగా మావోయిస్టులు
  • మరోసారి ఆయుధాలు చేపట్టబోమన్న మల్లోజుల
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయంగా ముందుకెళ్తామని వెల్లడి

దేశ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీ సాయుధ మార్గాన్ని వదిలి, పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుందని సమాచారం.


తాజాగా, ఆశన్న ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరోసారి ఆయుధాలు చేపట్టే ప్రసక్తే లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.


గత అక్టోబర్‌లో సోనూ 60 మంది, ఆశన్న 210 మంది మావోయిస్టు కేడర్లతో పాటు ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు.


ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే 600 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పోలీస్ కేంద్రాల్లో ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు పూర్తయ్యాక వీరంతా సాధారణ జీవితంలోకి వస్తారని అధికారులు చెబుతున్నారు.


పరిశీలకుల అభిప్రాయం ప్రకారం 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ కొత్త పార్టీ అధికారికంగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అయితే పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు పదాలు ఉంటాయా? ఎన్నికల్లో పోటీ చేస్తుందా? వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మాజీ మావోలు సాయుధ పోరాటం నుంచి రాజకీయ మార్గం వైపు అడుగులు వేయడం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Mallojula Venugopal
Maoists
Naxalites
Telangana
Chhattisgarh
Maharashtra
Indian Politics
Political Party
Aashanna
Takkellapalli Vasudeva Rao

More Telugu News