Virender Sehwag: టాలీవుడ్ హీరోలకు నేను పెద్ద ఫ్యాన్.. తెలుగు సినిమాలు చూడటమే నా పని: వీరేంద్ర సెహ్వాగ్
- టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్
- రిటైర్మెంట్ తర్వాత జీవితం ప్రశాంతంగా ఉందని వ్యాఖ్య
- మహేశ్ బాబు అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమన్న వీరూ
టీమిండియా తరఫున దూకుడైన ఆటతో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన వీరేంద్ర సెహ్వాగ్, ఇప్పుడు క్రికెట్ మైదానాన్ని కాదు… సినిమా థియేటర్‌నే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన రిటైర్మెంట్ జీవితంపై సరదాగా మాట్లాడారు.
క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికిన తర్వాత తన జీవితం చాలా ప్రశాంతంగా వుందని సెహ్వాగ్ చెప్పారు. “ఇప్పుడు నాకెక్కడా తొందర లేదు. టైమ్ బాగా దొరుకుతోంది. ఆ టైమ్‌లో నేను చేసే పని ఏంటంటే… టాలీవుడ్ సినిమాలు చూడటమే” అంటూ అందర్నీ నవ్వించారు.
తెలుగు హీరోలపై తనకున్న అభిమానాన్ని ఆయన దాచలేదు. ముఖ్యంగా మహేశ్ బాబు అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని చెప్పారు. అలాగే ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాను రెండుసార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. భాష పూర్తిగా అర్థం కాకపోయినా... హిందీ డబ్బింగ్‌లో అయినా తెలుగు సినిమాలు చూసే అవకాశం వదులుకోనని తెలిపారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా తనపై మంచి ఇంపాక్ట్ వేసిందన్నారు. అందులోని “తగ్గేదేలే” డైలాగ్, అల్లు అర్జున్ స్టైల్ ఇప్పటికీ తన మైండ్‌లో వున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సెహ్వాగ్‌తో పాటు కపిల్ దేవ్, సురేశ్ రైనా కూడా సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు టోర్నమెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.