Hyderabad: బంగారు ఆభరణాల బ్యాగును బస్సులో మరిచిపోయిన మహిళ

Hyderabad woman retrieves gold jewelry lost on bus
  • సెల్‌ఫోన్ హడావిడిలో 10 తులాల బంగారు ఆభరణాలను బస్సులో మరిచిపోయిన మ‌హిళ‌
  • నాచారం పోలీసుల చాకచక్యంతో తప్పిన నష్టం 
  • నిజాయతీ చాటిన ఆర్టీసీ బ‌స్సు కండక్టర్‌
హైద‌రాబాద్‌ నగరంలో రోజూ జరిగే ప్రయాణాల్లో ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద నష్టానికి దారి తీస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న హడావిడిలో ఓ మహిళ తన 10 తులాల బంగారు ఆభరణాల బ్యాగును ఆర్టీసీ బస్సులో మరిచిపోయింది. అయితే అప్రమత్తత, నిజాయతీ, పోలీసుల వేగవంతమైన చర్యల వల్ల నష్టం తప్పింది.

నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురానికి చెందిన వి. శ్రీదేవి మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో తార్నాక బస్‌స్టాప్‌ వద్ద చర్లపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఆమె వద్ద 10 తులాల బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు ఉంది. బస్సు నాచారం వద్దకు చేరుకోగానే ఆమెకు ఫోన్‌ కాల్‌ రావడంతో మాట్లాడుతూ హడావిడిగా బస్సు దిగింది. ఆ సమయంలో తన బ్యాగును సీటుపై వదిలేసిన విషయాన్ని ఆమె గమనించలేదు.

కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీదేవి వెంటనే నాచారం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. సంబంధిత బస్సు ఏ డిపోకు చెందిందో గుర్తించి, డ్రైవర్‌, కండక్టర్‌లకు సమాచారం అందించారు.

కండక్టర్ బస్సులో ఆమె కూర్చున్న సీటును పరిశీలించగా, అక్కడే బంగారు ఆభరణాల బ్యాగు సురక్షితంగా ఉండటాన్ని గుర్తించాడు. అనంతరం నాచారం సీఐ ధనుంజయ్య సమక్షంలో కండక్టర్‌ చేతుల మీదుగా ఆ బ్యాగును బాధిత మహిళకు అప్పగించారు. తన ఆభరణాలు సురక్షితంగా లభించడంతో శ్రీదేవి పోలీసులకు, ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. 
Hyderabad
RTC bus
gold jewelry
Nacharam police
lost and found
crime news
police investigation
bus conductor
Vanastalipuram
Sridevi

More Telugu News