Himanta Biswa Sarma: మెడిసిన్ పని చేయకుంటే శస్త్రచికిత్స అవసరం: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

Assam CM Himanta Biswa Sarma calls for surgery on Bangladesh issue
  • బంగ్లాతో దౌత్యానికి సమయం దాటి పోయింది శస్త్ర చికిత్స అవసరమన్న హిమంత
  • చికెన్స్ నెక్'ను భారత్ కాపాడుకోవాల్సి ఉందని వ్యాఖ్య
  • ఆందోళన అంతా వ్యూహాత్మకంగా కీలకమైన చికెన్స్ నెక్ గురించేనని వ్యాఖ్య
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళన, అశాంతిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ఆ దేశంతో దౌత్యానికి సమయం మించిపోయిందని, ఇక శస్త్రచికిత్స అవసరమని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆందోళన అంతా వ్యూహాత్మకంగా కీలకమైన 'చికెన్స్ నెక్' గురించేనని ఆయన అన్నారు.

దౌత్యం, ఇతర మార్గాల ద్వారా 20 నుంచి 22 కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కాపాడుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మందులు పని చేయనప్పుడు ఆపరేషన్ అవసరమవుతుందని అన్నారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటన సందర్భంగా 'చికెన్స్ నెక్' గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను 'సెవెన్ సిస్టర్స్' అంటారని, అవి బంగ్లాదేశ్‌తో సముద్రం తీరం లేని రాష్ట్రాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వారు సముద్రానికి చేరుకోవడానికి మరో మార్గం లేదని, ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం కాబట్టి చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

చికెన్స్ నెక్ కారిడార్ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో ఉంది. చికెన్స్ నెక్ అంటే కోడి మెడ వంటి సన్నని భాగం అని అర్థం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలను భారతదేశంతో కలిపే ఈ భాగం సన్నగా కోడి మెడ భాగంలా ఉంటుంది కాబట్టి చికెన్స్ నెక్ అంటారు. ఈ ప్రాంతంలో కొంత భాగం 20 నుండి 22 కిలో మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు అది దగ్గరలో ఈ చికెన్స్ నెక్ ఉంది.
Himanta Biswa Sarma
Assam CM
Bangladesh
Chicken's Neck
India Bangladesh relations
Mohammad Yunus

More Telugu News