Revanth Reddy: నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి రేవంత్ రెడ్డీ: హరీశ్ రావు

Harish Rao Demands Revanth Reddy Government Release Hidden GOs
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవోలను దాచిపెడుతోందని హరీశ్ రావు ఆరోపణ
  • 13 నెలల కాలంలో 82 శాతం జీవోలను రహస్యంగా ఉంచారని విమర్శ
  • జీవోల గోప్యతపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్య
  • చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉత్తర్వులను (జీవో) ప్రజలకు అందుబాటులో ఉంచకుండా దాచిపెడుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోగా బహిర్గతం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు... ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.

ఈ విషయంపై హరీశ్ రావు స్పందిస్తూ.. "ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, జీవోలను దాచిపెడుతూ పెద్ద డ్రామా ఆడుతోంది. మా పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన సమాచారంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వ అసలు రంగు బయటపడబోతోంది" అని తెలిపారు.

2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 వరకు మొత్తం 13 నెలల కాలంలో ప్రభుత్వం 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టిందని హరీశ్ రావు ఆరోపించారు. "ఏకంగా 15,774 జీవోలను, అంటే 82 శాతం జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారు? చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి, ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం?" అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తక్షణమే జీవోలన్నింటినీ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Revanth Reddy
Harish Rao
Telangana
Telangana Government
Government Orders
GOs
Congress
BRS
RTI
Public Interest Litigation

More Telugu News