Donald Trump: ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ క్లింటన్ ఫొటోలపై ట్రంప్ ఏమ‌న్నారంటే..!

Donald Trump comments on Bill Clinton photos in Epstein files
  • ఎప్స్టీన్ ఫైళ్ల వల్ల నిరపరాధుల ప్రతిష్ఠ దెబ్బతింటుందని ట్రంప్ వ్యాఖ్య
  • ఇది రిపబ్లికన్ విజయాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ
  • బిల్ క్లింటన్ ఫొటోల విడుదలపై ట్రంప్ అసంతృప్తి
  • ఫొటోలో కనిపించడమే నేరంగా మారుతోందని విమర్శ
లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్ల విడుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్స్టీన్‌ను కలిసిన అనేక మంది ప్రముఖుల ప్రతిష్ఠ ఈ ఫైళ్ల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. శుక్రవారం నుంచి అమెరికా న్యాయశాఖ ఈ ఫైళ్లను విడుదల చేయడం ప్రారంభించిన నేపథ్యంలో ట్రంప్ తొలిసారి స్పందించారు.

మార్-ఎ-లాగోలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. “ఈ ఎప్స్టీన్ వ్యవహారం రిపబ్లికన్ పార్టీ సాధించిన గొప్ప విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నం” అని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని అనవసరంగా పెద్దదిగా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

మొదటి విడత ఫొటోలలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కనిపించడంపై స్పందించిన ట్రంప్, “నాకు బిల్ క్లింటన్ అంటే ఇష్టం. ఆయనతో ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన ఫొటోలు బయటకు రావడం బాధాకరం” అన్నారు. తానూ ఎప్స్టీన్‌తో ఉన్న ఫొటోలలో కనిపించానని, ఆ కాలంలో చాలా మంది అతనితో స్నేహంగా మెలిగారని ట్రంప్ స్పష్టం చేశారు.

ఎప్స్టీన్‌తో నిజంగా సంబంధం లేని, కేవలం పార్టీల్లో కలిసిన బ్యాంకర్లు, న్యాయవాదులు వంటి గౌరవనీయుల ఫొటోలు బయటకు రావడం వల్ల వారి ప్రతిష్ఠ నాశనం అవుతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఒక ఫొటోలో కనిపించడమే నేరమా? దీని వల్ల అనవసరంగా చాలా మంది బాధపడుతున్నారు” అని ఆయన అన్నారు.

జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో లైంగిక అక్రమ రవాణా కేసులో విచారణ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే న్యూయార్క్ జైలులో మృతి చెందాడు. అది ఆత్మహత్యగా అధికారులు నిర్ధారించారు. అయితే, అతనితో సంబంధాలు ఉన్న ప్రముఖులపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Donald Trump
Jeffrey Epstein
Bill Clinton
Epstein files
sex trafficking
Mar-a-Lago
US Justice Department
New York jail
Epstein investigation
Republican Party

More Telugu News