AP High Court: ఆర్ఈటీపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court Key Verdict on RET Tax
  • అంచనా జనాభాతో పన్ను విధించరాదన్న హైకోర్టు 
  • కడప జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డీసీ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు 
  • మైదుకూరు మున్సిపల్‌ కమిషనర్‌ వేసిన జనాభా అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యాఖ్య 
రెస్టారెంట్ అండ్ బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ) విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారిక జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా, అంచనా వేసిన జనాభా ఆధారంగా ఆర్ఈటీ విధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్ -2025లోని రూల్ 3(టి) ప్రకారం జనాభా అంటే అధికారికంగా ప్రచురించిన జనాభా లెక్కలేనని న్యాయస్థానం గుర్తు చేసింది. 2011 తర్వాత అధికారిక జనాభా లెక్కలు జరగలేదని, ఆ లెక్కల ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 45,790 మాత్రమేనని పేర్కొంది.

50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఆర్ఈటీ కింద రూ.35 లక్షలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 2011 నుంచి జనాభా 1.9 శాతం పెరిగి ప్రస్తుతం 56,310కు చేరిందని మైదుకూరు మున్సిపల్ కమిషనర్ చేసిన అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. కమిషనర్ అంచనా జనాభాను ఆధారంగా తీసుకుని మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ బార్‌కు ఆర్ఈటీని రూ.55 లక్షలుగా నిర్ణయిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

పిటిషనర్ అభ్యర్థనను తీర్పు అందిన ఆరు వారాల్లోపు తిరిగి పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిర్ణీత గడువులోపు పునఃపరిశీలన చేయకపోతే మున్సిపాలిటీ జనాభా 50 వేల లోపే ఉన్నట్లు పరిగణించి రూ.35 లక్షల ఆర్ఈటీ మాత్రమే వసూలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీ కమిషనర్ అంచనా జనాభా ఆధారంగా విధించిన రూ.55 లక్షల ఆర్ఈటీని సవాల్ చేస్తూ ఓ బార్ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తుది విచారణ అనంతరం హైకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. 
AP High Court
Andhra Pradesh High Court
Retail Excise Tax
RET
Excise Rules 2025
Population Census
Maidukuru Municipality
Justice Tarlada Rajasekhar Rao
Excise Department
Andhra Pradesh

More Telugu News