Shivaji: చీరలోనే అందం.. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై శివాజీ వ్యాఖ్యలు వైరల్!

Shivaji Comments on Heroines Dressing Sense Go Viral
  • ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్‌పై శివాజీ వ్యాఖ్యలు
  • హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై అభిప్రాయాలతో చర్చ
  • సోషల్ మీడియాలో మద్దతు, విమర్శలు రెండూ
  • డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘దండోరా’
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, ముందుగా యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్‌ను ప్రశంసించిన అనంతరం, హీరోయిన్ల వేషధారణపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుందని శివాజీ వ్యాఖ్యానించారు. బహిరంగంగా అతిగా కనిపించే దుస్తులు వేసుకుంటే గౌరవం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. “అందం అంటే గౌరవంతో పాటు ఉండాలి. గ్లామర్ ఓ స్థాయి వరకు బాగుంటుంది. దాన్ని దాటి పోతే విమర్శలు తప్పవు” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావిస్తూ, స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మనమే కోల్పోకూడదని అన్నారు.

పాత తరం నటి సావిత్రి, సౌందర్య వంటి వారు గౌరవప్రదమైన వేషధారణతోనే చిరస్థాయిగా గుర్తుండిపోయారని, ఈ తరంలోనూ రష్మిక వంటి నటీమణులు తమదైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారని శివాజీ వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికలపై కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన మహిళలకే గుర్తింపు లభించిందని ఆయన అన్నారు.

అయితే, శివాజీ ఉపయోగించిన కొన్ని పదాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం చెప్పడం సరికాదని కాదు కానీ, మాటల ఎంపిక మర్యాదగా ఉండాల్సిందని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆయన మాటలకు మద్దతు తెలుపుతున్నవారూ ఉన్నారు.

ఇక‌ శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ వంటి సున్నిత అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి సినిమాలు నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. 
Shivaji
Dandora Movie
Hero Shivaji
Tollywood actresses
actress dressing sense
Savithri
Soundarya
Rashmika Mandanna
Telugu cinema
Ravindra Banerjee

More Telugu News