Mumbai Dubai underwater train: ముంబై టు దుబాయ్: సముద్రం అడుగున రైలు ప్రయాణం.. 2 గంటల్లోనే గమ్యానికి!

Underwater train Mumbai to Dubai travel in 2 hours
  • ప్రయాణాన్ని సమూలంగా మార్చేసే భారీ ప్రాజెక్టుకు పడుతున్న అడుగులు
  • గంటకు 600-1000 కిలోమీటర్ల వేగంతో ‘డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్’ ప్రయాణం
  • ప్రాజెక్టుకు 50 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా
  • ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా ముంబై
భారత్ - యూఏఈ మధ్య ప్రయాణాన్ని సమూలంగా మార్చేసే ఒక భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ముంబై నుంచి దుబాయ్‌కి అరేబియా మహా సముద్రం అడుగున హైస్పీడ్ రైలును నడపాలనే ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కల గనుక నిజమైతే గంటకు 600 నుంచి 1,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 'డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్' విమానం కంటే వేగంగా గమ్యస్థానానికి చేరుస్తుంది.

ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. సముద్ర మట్టానికి 200 మీటర్ల లోతులో ఉండే ఈ టన్నెల్‌కు పనోరమిక్ కిటికీలను ఏర్పాటు చేయనున్నారు. అంటే, మీరు రైల్లో కూర్చుని వెళ్తుంటే.. కిటికీ బయట తిమింగలాలు, షార్కులు, రకరకాల సముద్ర జీవులు మీ పక్కనే ఈదుతున్నట్లు కనిపిస్తాయి. సూపర్ సోనిక్ వేగంతో వెళ్తున్నప్పటికీ, ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంలో ప్రయాణిస్తున్న అద్భుత అనుభూతిని ఇది అందిస్తుంది.

సుమారు 50 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తలపెట్టిన ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికుల కోసమే కాదు, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా బలోపేతం చేయనుంది. దుబాయ్ నుంచి భారత్‌కు ముడి చమురును ఈ పైపులైన్ ద్వారా రవాణా చేయవచ్చు. భారత్ నుంచి స్వచ్ఛమైన నీటిని యూఏఈకి తరలించే అవకాశం ఉంటుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చులు దాదాపు 60 శాతం వరకు తగ్గుతాయని అంచనా.

ముంబై సరికొత్త గ్లోబల్ హబ్!
ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబై నగరం అంతర్జాతీయ వాణిజ్యానికి మరింత పెద్ద కేంద్రంగా మారుతుంది. అంతేకాకుండా, ఈ నిర్మాణం ద్వారా దాదాపు 50,000 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నుంచి దుబాయ్‌కి విమానంలో వెళ్లాలంటే 3 నుంచి 3.5 గంటల సమయం పడుతోంది. కానీ ఈ అండర్ వాటర్ ట్రైన్ ద్వారా కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టుపై భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ప్రపంచ రవాణా రంగంలోనే ఇదొక చారిత్రాత్మక విప్లవం కానుంది.
Mumbai Dubai underwater train
India UAE
high speed rail
undersea tunnel
transportation
infrastructure project
global hub
maritime transport
deep blue express
rail travel

More Telugu News