H-1B Visa: భారత నిపుణులకు గట్టి దెబ్బ.. హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుతో పెరుగుతున్న అనిశ్చితి

H1B Visa Interview Cancellations Cause Uncertainty for Indian Professionals
  • హెచ్‌-1బీ, హెచ్-4 వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్‌ను విస్తరించిన అమెరికా 
  • ఈ నెల‌ 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా కొత్త స్క్రీనింగ్ అమలు
  • భారత్‌లో వేలాది వీసా ఇంటర్వ్యూలు నెలల పాటు వాయిదా
  • భారత ఐటీ నిపుణులు, వైద్యులపై తీవ్ర ప్రభావం
హెచ్‌-1బీ, హెచ్-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రామాణిక వీసా స్క్రీనింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలన (వెట్టింగ్)ను అన్ని హెచ్‌-1బీ, హెచ్-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరుల‌కు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

ఈ నెల‌ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, దీంతో ఈ వీసా కేటగిరీలకు సంబంధించి అదనపు ప్రాసెసింగ్ సమయం పట్టే అవకాశముందని ఎంబసీ తెలిపింది. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే భారత్‌లో ఈ నెలాఖరులో జరగాల్సిన వేలాది హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా పలు నెలల పాటు వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

అమెరికా టెక్నాలజీ కంపెనీలు విస్తృతంగా వినియోగించే హెచ్‌-1బీ వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే హెచ్‌-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు. అత్యుత్తమ విదేశీ ప్రతిభను నియమించుకునే అవకాశాన్ని కొనసాగిస్తూనే, అక్రమాలు జరగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఎంబసీ వివరించింది.

కొత్త వెట్టింగ్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు భారీగా రద్దు అయ్యాయి. ఈ నెల‌ 15న ఇంటర్వ్యూ ఉన్న వారికి మార్చిలో కొత్త తేదీలు ఇవ్వగా, 19న అపాయింట్‌మెంట్ ఉన్నవారికి మే చివరి వరకు వాయిదా వేశారు. దీంతో ఇప్పటికే భారత్‌కు వచ్చిన అనేక మంది ఉద్యోగులు వీసా లేక అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్ప‌డింది.

ఇదిలా ఉంటే... అమెరికా వీసా 'ఒక హక్కు కాదని, అది ఒక ప్రత్యేక హోదా' (ప్రివిలేజ్) మాత్రమేనని ఎంబసీ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. వీసా జారీ అయిన తర్వాత కూడా స్క్రీనింగ్ కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది. రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ప్రతి వీసా నిర్ణయం జాతీయ భద్రతకు సంబంధించినదేనని అమెరికా స్పష్టం చేసినట్లు తెలిపారు.
H-1B Visa
US Visa
Indian IT Professionals
H-4 Visa
Visa Interview
Kirti Vardhan Singh
US Embassy India
Visa Delay
Immigration
US Immigration Policy

More Telugu News