Pawan Kalyan: రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయిపోయినట్టు జనసేనకు కుదరదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Janasena Cant Become YSR Congress Overnight
  • పదవి అలంకారం కాదు, బాధ్యత.. జనసేన శ్రేణులకు పవన్ దిశానిర్దేశం
  • మనకు రెడీమేడ్ కేడర్ లేదు.. పార్టీని మనమే నిర్మించుకోవాలని వ్యాఖ్యలు
  • పదవి అలంకారం కాదు బాధ్యత అని శ్రేణులకు సూచన
జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించాల్సిందే తప్ప, రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయినట్లు తమకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీకి కాంగ్రెస్ నుంచి రెడీమేడ్ కేడర్, కమిటీలు వచ్చాయని, కానీ జనసేన అలా కాకుండా సొంతంగా పునాదులు వేసుకోవాలని ఆయన అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన మూడు వేల మందికి పైగా పార్టీ నాయకులతో నిర్వహించిన 'పదవి - బాధ్యత' కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

“మన పంట మనమే పండించుకోవాలి, మన తిండి మనమే తినాలి” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనమే బలోపేతం చేసుకోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణానికి పిఠాపురాన్ని ఒక నమూనాగా తీసుకున్నామని, అక్కడ 53 గ్రామాలకు గాను 51 గ్రామాల్లో ఓటింగ్ పద్ధతి ద్వారా ప్రజాస్వామ్యయుతంగా గ్రామ, బూత్ కమిటీలను నియమించినట్లు వివరించారు. ఇదే పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.

త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని, మార్చి నాటికి రాష్ట్రమంతా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 'జెన్ జెడ్' థీమ్‌తో నిర్వహిస్తామని చెప్పారు. కూటమిలో భవిష్యత్తులో కొన్ని సర్దుబాట్లు, ఇబ్బందులు తప్పవని, వాటికి సిద్ధంగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు.

పదవి అనేది అలంకారం కాదని, అదొక బాధ్యత అని నిరూపించాలని నాయకులకు హితవు పలికారు. నాయకత్వం అంటే గొడవలు పెట్టడం కాదని, అందరినీ ఏకతాటిపైకి తెచ్చి సమస్యలను పరిష్కరించడమేనని అన్నారు. సమష్టిగా పనిచేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
Pawan Kalyan
Janasena Party
YSR Congress
Andhra Pradesh Politics
Party Building
Political Strategy
Pithapuram
Village Committees
Membership Drive
Coalition Politics

More Telugu News