Rifle Scope: చెత్తకుప్పలో పిల్లాడికి దొరికిన బొమ్మ.. తీరా చూస్తే అది చైనా తయారీ రైఫిల్ స్కోప్!

China Made Rifle Scope Found Near NIA Office in Jammu Kashmir
  • జమ్మూకశ్మీర్‌లోని ఎన్ఐఏ కార్యాలయం సమీపంలో ఘటన
  • సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు తుపాకికి అమర్చే టెలిస్కోప్ అని గుర్తించిన అధికారులు
  • కీలక కేంద్రాలు ఉన్న ప్రాంతంలో దొరకడంతో భద్రతా దళాల అప్రమత్తం
  • సాంబా జిల్లాలో 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జమ్మూ కశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీకి చెందిన ఒక శక్తిమంతమైన రైఫిల్ స్కోప్ (టెలిస్కోప్) లభించడం కలకలం రేపింది. ఈ ఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ కార్యాలయానికి సమీపంలోనే ఇలాంటి యుద్ధ పరికరాలు దొరకడం కలకం రేపింది.

జమ్మూ శివారులోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల బాలుడు ఒక వింత వస్తువుతో ఆడుకుంటుండగా స్థానికులు గమనించారు. ఆ చిన్నారి దానిని బొమ్మ అనుకొని ఆడుకుంటుండగా, అది తుపాకీకి అమర్చే టెలిస్కోప్ అని గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదయం ఒక చెత్త కుప్పలో ఆ వస్తువు దొరికిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో అది చైనాలో తయారైన రైఫిల్ స్కోప్ అని తేలింది. దీనిని అసాల్ట్ రైఫిళ్లకు లేదా స్నిపర్ రైఫిళ్లకు అమర్చి సుదూర లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.ఎన్ఐఏ కార్యాలయంతో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసు సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ బెటాలియన్ కేంద్రాలు ఉన్న అత్యంత కీలక ప్రాంతంలో ఇది దొరకడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జమ్మూలోని సాంబా జిల్లాలో 24 ఏళ్ల తన్వీర్ అహ్మద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ నివాసి అయిన తన్వీర్ మొబైల్‌లో ఒక పాకిస్థానీ ఫోన్ నంబర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడికి ఈ స్కోప్ దొరకడంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. సిద్రా ప్రాంతం మొత్తాన్ని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), పోలీసులు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆ టెలిస్కోప్‌ను అక్కడ పడేశారా? లేక దాడుల కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా ఇచ్చారు.
Rifle Scope
Jammu Kashmir
NIA
China made rifle scope
Tanveer Ahmed
Samba district
Asrarabad village
Terrorism
Security alert

More Telugu News