Tirumala: నేడు తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష .. ఎందుకంటే ..!

Tirumala High Level Review Meeting on Vaikunta Dwara Darshan
  • ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాలపై సమీక్షించనున్న మంత్రులు
  • హాజరుకానున్న మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి
  • గత ఏడాది ముక్కోటి ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంలో తొక్కిసలాట జరిగిన వైనం
తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ రోజు తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి వైకుంఠద్వార దర్శనాల ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు.
 
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల వైకుంఠద్వార దర్శనాలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మొత్తం 164 గంటల పాటు వైకుంఠద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
 
మిగిలిన ఏడు రోజుల పాటు ఎలాంటి టోకెన్లు లేకుండానే భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు భారీగా తరలి వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాద వితరణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
 
గత ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం ఏర్పడిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం, టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Tirumala
Venkateswara Swamy
Vaikunta Dwara Darshan
TTD
Andhra Pradesh
Vangala Poodi Anitha
Anam Ramnarayana Reddy
Mukoti Ekadasi
Tirupati
Pilgrims

More Telugu News