Sameer Minhas: భారత్‌పై భారీ స్కోరు చిరస్మరణీయం.. పాక్ అండర్-19 ఆటగాడు సమీర్

Scoring big against India will remain the most memorable achievement says Sameer
  • అండర్-19 ఆసియా కప్ ఫైనల్ పోరులో పాక్ ఘన విజయం
  • 172 పరుగులతో విధ్వంసం సృష్టించిన సమీర్ మిన్హాస్
  • పెద్ద టోర్నీ ఫైనల్‌లో భారత్‌పై భారీ స్కోరు సాధించాలన్న కల నెరవేరిందన్న బ్యాటర్
  • 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డులు అందుకున్న మిన్హాస్
చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పాక్ యువ బ్యాటర్ సమీర్ మిన్హాస్ (172) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్‌పై 191 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ విజయం సాధించి టైటిల్‌ను ముద్దాడింది. మ్యాచ్ అనంతరం సమీర్ మిన్హాస్ మాట్లాడుతూ భారత్‌పై ఇలాంటి ప్రదర్శన చేయడం తన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన సమీర్ మిన్హాస్.. పెద్ద టోర్నీ ఫైనల్లో భారత్‌పై భారీ స్కోరు సాధించాలనే తన చిన్ననాటి కల ఈరోజు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ సర్ ఇచ్చిన స్ఫూర్తితో భారత్‌ను ఓడించగలమని నమ్మామని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డులు అందుకున్న సమీర్ పేర్కొన్నాడు.

సమీర్ మిన్హాస్ తండ్రి కాషిఫ్ ముల్తాన్‌లో వ్యాపారవేత్త (మామిడి పండ్ల ఎగుమతి మరియు హల్వా వ్యాపారం). తన కుమారుడి విజయంపై ఆయన స్పందిస్తూ.. "భారత్‌పై గెలుపు మాకు 400 శాతం అదనపు ఆనందాన్ని ఇస్తుంది. నా కొడుకు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది" అని ఆనందం వ్యక్తం చేశాడు. సమీర్ సోదరుడు అరాఫత్ కూడా పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడటం విశేషం.

2019 నుంచి అండర్-19 స్థాయిలో భారత్‌తో జరిగిన 11 మ్యాచుల్లో పాకిస్థాన్‌కు ఇది ఏడో విజయం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే, ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్, ఫైనల్లో మాత్రం భారీ తేడాతో గెలిచి టైటిల్ నెగ్గడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు సమీర్ మిన్హాస్ కనీవినీ ఎరుగని ఇన్నింగ్స్‌తో బాసటగా నిలిచాడు. కేవలం 113 బంతుల్లోనే 9 సిక్సర్లు, 17 ఫోర్లతో 172 పరుగులు సాధించి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. పాక్ పేస్ త్రయం అలీ రజా, అబ్దుల్ సుభాన్, మొహమ్మద్ సయ్యమ్‌ల ధాటికి కుప్పకూలింది. కేవలం 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ కావడంతో పాక్‌కు రికార్డు స్థాయి విజయం దక్కింది.
Sameer Minhas
Pakistan Under 19
India Under 19
U19 Asia Cup Final
Cricket
Pakistan Cricket
India Pakistan Cricket
U19 Cricket
Samir Minhas 172 Runs
Asia Cup

More Telugu News