Ravichandran Ashwin: నా తమ్ముడు వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యాడు... చాలా ఆనందంగా ఉంది: అశ్విన్

Ravichandran Ashwin Happy with Sanju Samson World Cup Selection
  • టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక
  • వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు చోటు
  • స్పందించిన రవిచంద్రన్ అశ్విన్
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కోసం నేడు టీమిండియాను ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు కూడా జట్టులో స్థానం లభించింది. దీనిపై స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. "నా తమ్ముడు సంజూ శాంసన్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక అతను అభిషేక్‌ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు అద్భుతంగా ఉందని, టైటిల్ నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేడు భారత జట్టును ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, అనూహ్యంగా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించింది. వికెట్ కీపర్ జితేష్ శర్మకు కూడా చోటు దక్కలేదు. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌తో జార్ఖండ్‌ను విజయపథంలో నడిపించిన ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన రింకూ సింగ్‌కు కూడా మళ్లీ అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో కష్టపడి తన సత్తా చాటిన ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వడంపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.

జట్టు ఎంపికపై అశ్విన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, "టైటిల్ డిఫెన్స్ లోడింగ్. అద్భుతమైన జట్టు. రింకూ తిరిగి రావడం సంతోషంగా ఉంది. నా తంబి సంజూ ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అతను అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. అడిపోలి చెట్టా! (అదిరిపోవాలి సోదరా) దేశవాళీ క్రికెట్‌లో తీవ్రంగా శ్రమించి తన సత్తా చాటిన ఇషాన్‌కు నా అభినందనలు" అని పోస్ట్ చేశారు.

2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. పాకిస్థాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీకి ముందు భారత్, న్యూజిలాండ్‌తో జనవరి 21 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.

భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్.
Ravichandran Ashwin
Sanju Samson
T20 World Cup
India squad
Abhishek Sharma
Ishan Kishan
Suryakumar Yadav
Ajit Agarkar
T20 team selection
Cricket

More Telugu News