Army Jawan: ట్రైన్లో మహిళపై అత్యాచారం.. ఆర్మీ జవాన్ అరెస్టు

Army Jawan Arrested for Rape on Train in Ranchi
  • రాంచీలోని రైల్వే స్టేషన్ లో దారుణం
  • మద్యం మత్తులో జవాన్ అఘాయిత్యం
  • జవాన్‌ను పట్టుకుని చితకబాదిన ప్రయాణికులు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దేశ రక్షణ విధుల్లో ఉండాల్సిన ఓ ఆర్మీ జవానే ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన టాటీసిల్వాయి రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ ఆరోపణలపై పోలీసులు నిందితుడైన సైనికుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 22 ఏళ్ల యువతి రాంచీ వెళ్లేందుకు రైలు కోసం స్టేషన్‌లో ఎదురుచూస్తోంది. అదే సమయంలో డిఫెన్స్ లాజిస్టిక్స్ రైలుకు భద్రతా విధుల్లో ఉన్న సైనికుడు, ఆమెను ఓ ఖాళీ బోగీలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలోని ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని తోటి ప్రయాణికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.

నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవాడని, పంజాబ్‌లోని పాటియాలాలో విధులు నిర్వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.
Army Jawan
Ranchi
Jharkhand
Train Rape
Tatisilwai Railway Station
Prayagraj
Uttar Pradesh
Patiala
Punjab

More Telugu News