Taj Mahal: తాజ్ మహల్ ను కమ్మేసిన పొగమంచు.. టూరిస్టుల నిరాశ

Taj Mahal Shrouded in Fog Disappoints Tourists
  • వ్యూ పాయింట్ నుంచి అస్సలు కనిపించని తాజ్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • తాజ్ ఎక్కడుందంటూ కామెంట్లు పెడుతున్న యూజర్లు
ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. పలు నగరాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు అలముకుంటోంది. రెండు మూడు అడుగుల దూరంలో ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించిన పర్యాటకులు పొగమంచు కారణంగా తాజ్ అందాలను చూడలేకపోతున్నామని వాపోతున్నారు. తాజ్ మహల్ అందాలను కనులారా వీక్షించాలని వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న సందర్శకులు, పొగమంచు కారణంగా ఏమీ కనిపించకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.

శనివారం ఉదయం పొగమంచు తాజ్ మహల్ ను కమ్మేసిన దృశ్యాన్ని ఓ పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వ్యూ పాయింట్ నుంచి చూస్తే తెల్లటి పొగమంచు తప్ప తాజ్ కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు అక్కడ తాజ్ మహల్ ఎక్కడుందంటూ కామెంట్లు పెడుతున్నారు. శనివారం ఉదయం తాజ్ మహల్ ప్రధాన ద్వారం వద్ద నిలబడినా లోపల ఉన్న కట్టడం కనిపించలేదు. దీంతో పర్యాటకులు దీనిని 'తాజ్ మహల్' అనాలా? లేక 'ఫాగ్ మహల్' అనాలా? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

తాజ్ మహల్ ముందు సెల్ఫీలు, ఫోటోలు దిగాలనుకున్న పర్యాటకులకు కేవలం తెల్లటి పొగమంచు మాత్రమే బ్యాక్ గ్రౌండ్‌లో కనిపిస్తోంది. మంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యమవడమే కాకుండా, తాజ్ మహల్ సరిగ్గా కనిపించకపోవడంతో గైడ్లు, స్థానిక వ్యాపారుల ఉపాధిపై కూడా ప్రభావం పడుతోంది. రానున్న కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ సందర్శనకు వచ్చే వారు వాతావరణం చూసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Taj Mahal
Agra
Fog
Foggy Weather
Tourist Disappointment
Uttar Pradesh
India Tourism
Weather Forecast
Travel
Winter Season

More Telugu News