Viral Video: పుతిన్ ప్రెస్‌మీట్‌లో లవ్ ప్రపోజల్.. జర్నలిస్ట్ రిక్వెస్ట్‌కు అధ్యక్షుడి రియాక్షన్ వైరల్!

Vladimir Putin Press Conference Love Proposal Viral
  • పుతిన్ మీడియా సమావేశంలో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్
  • ప్రశ్న అడగబోయే ముందు లైవ్‌లోనే పెళ్లి ప్రతిపాదన
  • తమ పెళ్లికి రావాలంటూ పుతిన్‌కు ఆహ్వానం
  • ఆర్థిక సాయం చేస్తానంటూ చమత్కరించిన రష్యా అధ్యక్షుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్వహించే మీడియా సమావేశాలు సాధారణంగా సీరియస్‌గా సాగుతాయి. కానీ, ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఊహించని, సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఓ యువ జర్నలిస్ట్, అధ్యక్షుడిని ప్రశ్న అడగడానికి ముందు లైవ్‌లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు పెళ్లి ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
23 ఏళ్ల కిరిల్ బజనోవ్ అనే జర్నలిస్ట్, పుతిన్ మీడియా సమావేశంలో తన వంతు వచ్చినప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. "నా గర్ల్‌ఫ్రెండ్ ఈ కార్యక్రమాన్ని చూస్తోంది" అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ వెంటనే, "ఓల్గా, నన్ను పెళ్లి చేసుకుంటావా? దయచేసి నన్ను పెళ్లి చేసుకో.. నీకు ప్రపోజ్ చేస్తున్నాను" అని కెమెరా ముందు ప్రకటించాడు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అంతటితో ఆగకుండా కిరిల్, తమ పెళ్లికి ముఖ్య అతిథిగా రావాలంటూ పుతిన్‌ను ఆహ్వానించాడు. దీనిపై పుతిన్ నవ్వుతూ స్పందించారు. పెళ్లికి వస్తానని చెప్పనప్పటికీ, చమత్కారంగా బదులిచ్చారు. "యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల గురించి కిరిల్ ఇప్పుడే అడుగుతున్నాడు. కుటుంబానికి పురుషుడే ఆధారంగా ఉండాలి. మేమంతా కలిసి కొంత డబ్బు సేకరించి కనీసం పెళ్లి ఖర్చులకైనా సాయం చేస్తాం" అని అన్నారు.

ఈ వీడియోను రష్యన్ బ్రాడ్‌కాస్టర్ 'ఆర్టీ' తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకోవడం విశేషం. ఈ సరదా సన్నివేశంపై నెటిజన్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. ఆ జర్నలిస్ట్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, పుతిన్ హాస్యచతురతను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video
Vladimir Putin
Putin press conference
Russian journalist
marriage proposal
Kirill Bazhanov
Olga marriage
Russia news
Putin reaction
press conference

More Telugu News