Nara Lokesh: నీకు మెంటార్ గా ఉంటా.. నీ ఫోన్ నెంబరు ఇవ్వు!: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh to Mentor Youth Interested in Politics
  • రాజమండ్రిలో విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి
  • మాజంలో మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
  • మీరు నాకు మెంటర్ అవుతారా అని అడిగిన విద్యార్థికి లోకేశ్ అంగీకారం
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ
  • జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటన
  • మహిళలను గౌరవించేలా కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యేక కార్యాచరణ
సమాజంలో మనం ఆశించే మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ‘హలో లోకేశ్’ ముఖాముఖి కార్యక్రమంలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.

"యువత రాజకీయాల్లోకి రావాలని మీరు అంటున్నారు. మరి మీరు నాకు మెంటర్‌గా వ్యవహరిస్తారా?" అని కిరణ్ అనే విద్యార్థి లోకేశ్ ను నేరుగా ప్రశ్నించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి, "మేం కచ్చితంగా యువతను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాం. నీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత తప్పకుండా నీకు మెంటర్‌గా ఉంటాను. నీ ఫోన్ నంబర్ ఇవ్వు" అని చెప్పడంతో సభ చప్పట్లతో మార్మోగింది.

ఈ సందర్భంగా ఇతర విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్ ఓపికగా సమాధానమిచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే జనవరి నెలలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు అకడమిక్స్‌ను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నామని, రాష్ట్రంలో 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని తెలిపారు. విద్యార్థులు ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలో తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు 'నైపుణ్యం' పేరుతో ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తున్నామని వివరించారు.

మహిళల గౌరవంపై ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. "మా అమ్మగారిని అవమానించినప్పుడు నేను పడిన బాధ ఇంతాఇంతా కాదు. అందుకే మహిళల గౌరవం అనేది ఓ ఉద్యమంలా మారాలి" అని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాల్లో మార్పులు తెస్తామని, ప్రతి శనివారం నైతిక విలువలపై తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించుకున్నామని గుర్తుచేశారు.

ప్రతి విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఉచితంగా అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తాను ఎక్కువగా జెమినై వినియోగిస్తానని, దానినే విద్యార్థులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. కళాశాలల్లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వ్యక్తిగత, సామాజిక, కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలపై మంత్రిని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.
Nara Lokesh
AP Minister
Andhra Pradesh
Job Calendar
Skills Portal
Artificial Intelligence
Education
Youth Politics
Rajamahendravaram
Chaganti Koteswara Rao

More Telugu News