Jeffrey Epstein: బిల్ గేట్స్, చోమ్స్కీ ఫొటోలు.. కలకలం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్

Bill Gates and Chomsky Photos Surface in Jeffrey Epstein Files
  • జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ నుంచి 68 కొత్త ఫొటోలు విడుదల
  • ప్రముఖులతో పాటు పలు దేశాల మహిళల పాస్‌పోర్టుల చిత్రాలు
  • యువతుల రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు రేకెత్తించిన టెక్స్ట్ మెసేజ్
అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో డెమోక్రాట్లు మరిన్ని ఫొటోలను బయటపెట్టారు. ఎప్స్టీన్‌కు సంబంధించిన పూర్తి ఫైల్స్‌ను విడుదల చేయాలని ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా, గురువారం 68 కొత్త చిత్రాలను విడుదల చేశారు. న్యాయశాఖకు విధించిన గడువు శుక్రవారంతో ముగియనుండగా ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా విడుదల చేసిన ఫొటోలలో పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, గుర్తింపు పత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్‌పోర్టులు ఉండటం గమనార్హం. అంతేకాకుండా, ప్రముఖ మేధావి నొవామ్ చోమ్స్కీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫిల్మ్‌మేకర్ వుడీ అలెన్, ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ వంటి ప్రముఖుల చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఈ ఫొటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లుగా కనిపించడం లేదు.

అయితే, కొన్ని ఫొటోలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. ఓ టెక్స్ట్ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లో "నా స్నేహితురాలు కొందరు అమ్మాయిలను పంపింది. అమ్మాయికి 1000 డాలర్లు అడుగుతోంది. ఇప్పుడు వారిని నీకు పంపిస్తాను. బహుశా జే (జెఫ్రీ)కి ఎవరైనా నచ్చొచ్చు" అని ఉంది. మరొక చిత్రంలో, ఒక మహిళ పాదంపై 'లోలిటా' నవలలోని వాక్యం రాసి ఉండటం కలకలం రేపుతోంది.

అమెరికా ప్రజలకు పారదర్శకత అందించేందుకే ఈ ఫైల్స్‌ను విడుదల చేస్తున్నామని డెమోక్రాట్లు చెబుతున్నారు. మరోవైపు, రిపబ్లికన్లు మాత్రం డెమోక్రాట్లు తమకు అనుకూలమైన విషయాలను ఎంచుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎప్స్టీన్, 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 'ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్' ప్రకారం న్యాయశాఖ వెంటనే ఫైల్స్‌ను విడుదల చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
Jeffrey Epstein
Bill Gates
Noam Chomsky
Epstein files
Epstein case
Sex trafficking
US politics
Democrats
Passports
Epstein files transparency act

More Telugu News