Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సజ్జనార్ పర్యవేక్షణలో కొత్త సిట్

Sajjanar Oversees New SIT in Phone Tapping Case
  • బీఆర్ఎస్ హయాం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు కొత్త సిట్
  • హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యుల బృందం
  • దర్యాప్తు వేగంగా పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు
  • ఇటీవల లొంగిపోయిన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు
  • ప్రతిపక్ష నేతలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని ప్రధాన ఆరోపణ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ బి. శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కొత్త సిట్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్, డీసీపీలు రితిరాజ్, కె. నారాయణ రెడ్డి వంటి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి దర్యాప్తు అధికారిగా కొనసాగుతారు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న సిట్ ముందు లొంగిపోయిన వారం రోజులకే ఈ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావించిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, చివరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం అక్రమంగా ట్యాప్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఏడాది మార్చిలో మాజీ డీఎస్పీ డి. ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేయడం కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Sajjanar
Phone tapping case
Telangana
BRS
VC Sajjanar
T Prabhakar Rao
Praneeth Rao
Hyderabad Police
SIT investigation

More Telugu News