Omar Abdullah: ఒమర్ అబ్దుల్లాపై పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

Omar Abdullah Criticized by Peoples Conference MLA
  • బీజేపీ ఏజెంట్లుగా ముద్రవేసి ఒమర్ అబ్దుల్లా గెలిచారన్న సజాద్
  • ఇప్పుడు ఆయన బీజేపీకి 'ఏ' టీమ్‌గా మారారని విమర్శలు
  • ఎల్జీని నియమించిన ప్రధానమంత్రిని మాత్రం ఆయన విమర్శించడం లేదని వ్యాఖ్య
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్, ఎమ్మెల్యే సజాద్ గని తీవ్ర విమర్శలు గుప్పించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒమర్ ఇతర పార్టీలను బీజేపీ ఏజెంట్లుగా ముద్ర వేశారని, గెలిచిన తర్వాత ఆయన ఆ పార్టీకి 'ఏ' టీమ్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శలు చేశారు.

ప్రతి ఒక్కరిని బీజేపీ ఏజెంట్లుగా ముద్ర వేసి ఎన్నికల్లో గెలిచిన ఒమర్ అబ్దుల్లా, ఇప్పుడు అదే పార్టీతో కలిసి సాగుతున్నారని మండిపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీ బీజేపీతో పోరాడుతుందని భావించిన కశ్మీరీలందరికీ ఇది ఒక గుణపాఠమని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఈ ముఖ్యమంత్రి ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారని, కానీ ఆ లెఫ్టినెంట్ గవర్నర్‌ను పంపించింది ప్రధానమంత్రి కాదా అని నిలదీశారు.

సిన్హాను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించిన ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఒమర్ అబ్దుల్లా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. జమ్ము కశ్మీర్‌లో అధికారమంతా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు నిత్యం చెబుతున్నారని గుర్తు చేశారు.
Omar Abdullah
Jammu Kashmir
Sajad Gani
Peoples Conference
BJP
National Conference

More Telugu News