Rajnath Singh: 'ఆపరేషన్ సిందూర్' మన సత్తా చాటింది... వేగంగా, కచ్చితత్వంతో దాడులు చేయగలం: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh India Capable of Swift Accurate Strikes Operation Sindoor
  • ఉగ్రశిబిరాల ధ్వంసంలో వాయుసేన వేగం, కచ్చితత్వం అద్భుతమ‌ని ప్ర‌శంస‌
  • పాక్ దాడుల యత్నం వేళ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్న రాజ్ నాథ్
  • ఆధునిక యుద్ధాల్లో వైమానిక శక్తిదే నిర్ణయాత్మక పాత్ర అని స్పష్టీక‌ర‌ణ‌
'ఆపరేషన్ సిందూర్' సమయంలో.. వేగంగా, అత్యంత ప్రభావవంతంగా స్వల్పకాలిక సైనిక చర్యలు చేపట్టగల సత్తాను భారత్ స్పష్టంగా నిరూపించుకుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత వైమానిక దళం (IAF) సాంకేతికంగా, కార్యాచరణ పరంగా అత్యంత పటిష్ఠమైన శక్తిగా అవతరించిందని ఆయన కొనియాడారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో వాయుసేన చూపిన ధైర్యం, వేగం, కచ్చితత్వాన్ని రాజ్ నాథ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దాడుల అనంతరం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యంగా స్పందించిన తీరును కూడా ఐఏఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపారు. పాక్ దాడులకు ప్రయత్నించినప్పుడు కూడా భారత ప్రజలు ప్రశాంతంగా తమ పనుల్లో నిమగ్నమవడం మన సైనిక సన్నద్ధతపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ వంటి ఇటీవలి అంతర్జాతీయ ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఆధునిక యుద్ధాల్లో వాయుసేనదే నిర్ణయాత్మక పాత్ర అని రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వేగం, కచ్చితత్వంతో ప్రత్యర్థికి స్పష్టమైన వ్యూహాత్మక సందేశం ఇవ్వడానికి వైమానిక శక్తి ఒక కీలక సాధనంగా మారిందని వివరించారు.

21వ శతాబ్దపు యుద్ధాలు సాంకేతికత, ఆలోచనలపై ఆధారపడి ఉంటాయని, సైబర్ వార్‌ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవరహిత వ్యవస్థల ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. జాతీయ ఆస్తుల పరిరక్షణకు ప్రధాని మోదీ ప్రకటించిన 'సుదర్శన చక్ర' కీలకమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయంగా జెట్ ఇంజన్ల అభివృద్ధిని జాతీయ మిషన్‌గా ప్రకటించామని గుర్తుచేశారు. 'ఆపరేషన్ సిందూర్' త్రివిధ దళాల మధ్య సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, వాయుసేన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Rajnath Singh
Operation Sindoor
Indian Air Force
IAF
Air Force Commanders Conference
Pakistan
Air Strikes
Defense Minister
Military Operations
Cyber Warfare

More Telugu News