VC Sajjanar: నేరస్తులకు ఉమ్మడి ఉచ్చు: ఏకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు

VC Sajjanar Leads Joint Police Action for Hyderabad Crime Control
  • నేర నియంత్రణపై మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం
  • ‘జీరో డిలే’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం
  • పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ఉమ్మడి నిఘాకు ఆదేశాలు
హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా మూడు కమిషనరేట్ల పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ల పరిధులు, సరిహద్దులతో సంబంధం లేకుండా నేరం జరిగిన వెంటనే స్పందించేలా ‘జీరో డిలే’ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నేరస్తులు ఒకచోట నేరం చేసి మరో కమిషనరేట్ పరిధిలోకి పారిపోతున్న ఘటనలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టారు.

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం దొరుకుతోందన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అనేది చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.

పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై మూడు కమిషనరేట్ల పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

శాంతిభద్రతలతో పాటు నగరంలోని ట్రాఫిక్ నిర్వహణపైనా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ వాహనాల ‘నో ఎంట్రీ’ సమయాలను ఒకేలా అమలు చేయాలని, ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ వాహనాలను నగరం వెలుపలే నిలువరించాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలువురు జాయింట్ సీపీలు, డీసీపీలు పాల్గొన్నారు. 
VC Sajjanar
Hyderabad police
Cyberabad police
Rachakonda police
Crime control
Zero delay policy
Traffic management
Law and order
Telangana police
Integrated Command Control Center

More Telugu News