wife murder: భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి ఇంట్లోనే పాతిపెట్టిన భర్త.. యూపీలో ఘోరం

Man Kills Wife and Daughters in UP Buries Them Inside House
  • బుర్ఖా ధరించకుండా తన పరువు తీశారని దారుణానికి తెగబడ్డ వ్యక్తి
  • వారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • పోలీసుల విచారణలో దారుణాన్ని బయటపెట్టిన నిందితుడు
ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చి, ఇంట్లోనే పాతిపెట్టాడు. వారం రోజులుగా ఆ ముగ్గురూ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిన దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
 
షామ్లీ జిల్లా కేంద్రంలో ఫరూఖ్, ఆయన భార్య తహీరా(35), కుమార్తెలు షరీన్(14), అఫ్రీన్ (6)లతో నివసిస్తున్నాడు. నెల రోజుల క్రితం తహీరా, ఫరూఖ్ ల మధ్య గొడవ జరిగింది. తనకు కొంత డబ్బు కావాలని అడిగితే భర్త ఇవ్వకపోవడంతో పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, భార్యాపిల్లలు బుర్ఖా ధరించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అవమానకరంగా భావించిన ఫరూఖ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. నెల రోజులు పుట్టింట్లోనే ఉన్న భార్యాపిల్లలను వారం రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. ఆపై రాత్రిపూట వారిని తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపాడు.

ఇంట్లోనే గొయ్యి తవ్వి ముగ్గురి మృతదేహాలను పాతిపెట్టాడు. మరుసటి రోజు నుంచి ఏమీ జరగనట్లే ఉన్నాడు. అయితే, ఫరూఖ్ భార్యాపిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు అతడిని నిలదీశారు. ఫరూఖ్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. భార్యాపిల్లలు కనిపించకుండా పోయినా నిశ్చింతగా ఉంటున్న ఫరూఖ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఇంట్లో తవ్వి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఫరూఖ్ పై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
wife murder
daughter murder
Uttar Pradesh
Shamli district
crime news
family tragedy
domestic violence
double murder
crime in India

More Telugu News