Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ.. 28న రికార్డు స్థాయిలో ప్రయాణిస్తారని అంచనా!

Dubai Airport Expects Record Rush on December 28
  • పండుగ సీజన్‌పై దుబాయ్ విమానాశ్రయం కొత్త అంచనాలు
  • 28న అత్యధికంగా 3.12 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా
  • డిసెంబర్ నెలలో మొత్తం 87 లక్షల మంది ప్రయాణించే అవకాశం
  • క్రిస్మస్, న్యూ ఇయర్ మధ్య పెరిగిన ప్రయాణాల డిమాండ్
  • పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న దుబాయ్ విమానాశ్రయం
పండుగ సీజన్ నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీపై తన అంచనాలను సవరించింది. కొత్త అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ అత్యంత రద్దీగా ఉండే రోజుగా నిలవనుంది. ఆ ఒక్కరోజే దాదాపు 3,12,000 మందికి పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నారని అధికారులు వెల్లడించారు.

వాస్తవానికి, ఈ నెల 20న అత్యధికంగా 3,09,000 మంది ప్రయాణిస్తారని గతంలో అంచనా వేశారు. అయితే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల మధ్య ప్రయాణ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో అధికారులు తమ అంచనాలను మార్చారు. పండుగ సెలవులను దుబాయ్‌లో గడిపేందుకు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లే నివాసితులతో విమానాశ్రయం కిటకిటలాడనుంది.

డిసెంబర్ నెల మొత్తం దుబాయ్ విమానాశ్రయం చరిత్రలోనే అత్యంత రద్దీ నెలగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ నెలలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 87 లక్షలు దాటుతుందని అంచనా. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని, అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా దుబాయ్ పేరుగాంచిన విషయం తెలిసిందే.
Dubai Airport
Dubai International Airport
DXB
Airport rush
Holiday season
Travel demand
Christmas travel
New Year travel
International tourists
Passenger traffic

More Telugu News